Kalyanalakshmi | కేపీహెచ్బీ కాలనీ, మే 2: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు వాగ్దానం చేశారని.. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న నేటికి తులం బంగారం ఇవ్వడం లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. శుక్రవారం కూకట్పల్లి మండల కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, పగడాల శిరీష బాబురావు, సబిహ బేగం, ఎంఈఓ స్వామీలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. ఆడబిడ్డ పెళ్లి కష్టాలు తెలిసిన కేసీఆర్.. దేశంలో ఎక్కడా లేనివిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని తెలిపారు. మొదట యాబై ఒక వేలు, తర్వాత రూ.71 వేలు ఇచ్చారని, ఆ తర్వాత 1,00,116 రూపాయలు ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.