హైదరాబాద్, ఏప్రిల్ 6 ( నమస్తే తెలంగాణ ) : ‘కంచ గచ్చిబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకుందాం. అప్పటిదాకా పోరాటం ఆపొద్దు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులు, పర్యావరణవేత్తలకు పిలుపునిచ్చారు. సంఘటిత పోరాటంతో హెచ్సీయూ తరలింపు, ఎకో పార్క్ ఏర్పాటు కుట్రలను తిప్పికొడదామని ఉద్బోధించారు. భవిష్యత్తు తరాల కోసం హెచ్సీయూ విద్యార్థులు చేసిన అద్భుత పోరాటంపై కాంగ్రెస్ సర్కారు అభాండాలు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న తరుణంలో ఆదివారం విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఉదాత్త లక్ష్యాలతో, నిస్వార్థంగా చేసే ఉద్యమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని, చరిత్రను చూస్తే అర్థమవుతుందని ఉద్ఘాటించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను కాపాడేందుకు కదిలివచ్చిన విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. వందల రకాల జంతుజాలం, వృక్షజాతులతో ఉన్న ప్రాంతాన్ని రక్షించి భవిష్యత్తు తరాలకు అందించేందుకు విద్యార్థులు చేసిన పోరాటానికి, దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసిరావడంతో ఉద్యమం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారిలా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసం కంచ గచ్చిబౌలి భూముల వేలాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యను తప్పుదోవ పట్టించేందుకు బెదిరింపులకు దిగడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ భూముల్లో ఎకో పార్క్ ఏర్పాటు, ఫోర్త్సిటీకి యూనివర్సిటీ తరలింపు అంటూ సీఎం కార్యాలయం మొదలుకొని కాంగ్రెస్ నేతల వరకు చేస్తున్న కుట్రలను కేటీఆర్ ఎండగట్టారు. 50 ఏండ్లకుపైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు నిలయంగా, విజ్ఞాన కేంద్రంగా నిలిచిందని తెలిపారు. విద్యార్థుల పోరాటం ఫలించడంతో ప్రభుత్వం చేయబోయిన పర్యావరణ హత్యను సుప్రీంకోర్టు అడ్డుకున్నదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కుట్రలు ఆపనందున ఈ పోరాటం ముగిసిపోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కుట్రపూరిత ఎత్తుగడలు, బెదిరింపులు, దుష్ప్రచారాన్ని దాటుకొని ముందుకుసాగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు పోరుకు తెలంగాణలోని పర్యావరణవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థిలోకం కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆ 400 ఎకరాల్లో పర్యావరణ పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని, విద్యార్థుల ఉద్యమానికి అండగా ఉన్నదని, భవిష్యత్తులో మరింత రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకునేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతినబూనారు.