తెలంగాణలో సాగు ఆగమైంది… అన్నదాత బతుకు ఛిద్రమైంది. ఆరుగాలం శ్రమించిన పంటను అమ్ముకొనేందుకు రైతులు అరిగోస పడుతున్నరు. స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లపాటు పండుగలా సాగిన వ్యవసాయం, సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభంలో నేడు చిక్కుకున్నది. ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ పడావు పెట్టింది. నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండుబెడుతున్నది. పెట్టుబడి సాయం అందక రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఆటంకాలను అధిగమించి రైతులు పండించిన పంటను కొనకుండా ప్రభుత్వం వేధిస్తున్నది. ప్రైవేటు వ్యాపారులు అడ్డికిపావుశేరు కొంటూ అన్నదాతలను నిండా ముంచుతున్నరు. కాంగ్రెస్ ఇచ్చిన బోనస్ బోగస్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైతుల ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
శ్రీ రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ‘తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. ఆరు దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబరంగా సాగు చేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టి కొట్టింది. రైతుకు రక్షణగా కేసీఆర్ గారు అమలుచేసిన ఒక్కో పథకానికి గత రెండేన్నరేండ్లుగా పాతరేసిన మీరు మీ చేతకానితనంతో అన్నదాత వెన్నువిరిచారు. ఇవాళ మీ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్టకు చేరాయి. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండునెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు. చేతకాని మీ సర్కారు నిర్వాకం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలన చూసినా ఈ రోజు రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండెపగిలి కుప్పకూలుతున్నా మీ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదు. 70 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో మీకున్న శ్రద్ధలో ఒక్క శాతమైనా రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మీ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదు.
పెట్టుబడి సాయాన్ని వరుసగా నాలుగు సార్లు ఎగ్గొట్టినా, యూరియా కష్టాల పాలుజేసినా రైతులు అన్నింటినీ దిగమింగి పండించిన ఏ పంటను మీ ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పదిమంది రైతులు వడదెబ్బకుతోడు సర్కార్ చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాలు కోల్పోయారు. అయినా కనీసం ఒక్కసారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదు.
అందుకే రైతులు మరో మార్గం కనిపించక, ఇంతకాలం కంటిపాపలా పెంచుకున్న పంటను తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారు. ఇవాళ తెలంగాణలోని రోడ్లపై కాలిబూడిదవుతున్న ధాన్యం కుప్పలు మీ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలు. రెండు నెలలుగా రాష్ట్రంలో నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోకో జరగని రహదారి లేదు. ఈ 30 నెలల్లోనే సమైక్యరాష్ట్రం నాటి సకల కష్టాల్లో మళ్లీ రైతులను ముంచెత్తారు. ఇన్నాళ్లు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చారు. కష్టాల్లో కొట్టమిట్టాడుతున్న తెలంగాణ రైతుల కన్నీళ్లతో ఖాళీగా ఉన్న రిజర్వాయర్లు నిండేలా ఉన్నాయి. పగలూ రాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప.. పరిపాలనపై మీకు కనీస పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారింది. విలువైన భూములను తెగనమ్మి వేలకోట్లు దోచుకోవాలన్న ఉత్సాహం తప్ప.. రైతుల పంటలను కొనాలన్న ధ్యాస మీలో ఏమాత్రం కనిపించడం లేదు. రోడ్లపై జరుగుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకు, మీ మంత్రులు హెలికాప్టర్లో షికార్లు కొడుతున్నారు. చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వచ్చిందంటే, సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదో అర్థం చేసుకోవచ్చు.
వరంగల్ నుంచి ఖమ్మం వరకు చాలా జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కనీసం ఒక్కటంటే ఒక్క లారీ లోడ్ కూడా ఎత్తడం లేదు. ఇక అడపా దడపా చేసే కొనుగోళ్లలోనూ ఒక్కోచోట 10 కిలోలకు పైగా తరుగుతీస్తే ఇక రైతులకు మిగిలేదేంటో మీరే సమాధానం చెప్పాలి. చివరికి గన్నీ బ్యాగ్‌ల కోసం రైతులే రూ.50 చొప్పున డిపాజిట్ చేసే దుస్థితి తెచ్చినందుకు మీరు, మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇచ్చే మొఖం మీ సర్కార్‌కు ఎలాగూ లేదని ఇప్పటికే తేలిపోయింది. చివరికి పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు మీరు క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాయండి. అన్నదాతలు అడుగడుగునా పడిగాపులు పడుతుంటే వాటిని వదిలేసి, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలన్న మీ సర్కార్‌కు ప్రాధాన్యతలే కాదు, చివరికి సోయి కూడా లేదని తేలిపోయింది.
కేసీఆర్ గారి హయాంలో మూడు నెల ముందు నుంచే పంటల కొనుగోలు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసేవారు. గన్నీ బ్యాగుల నుంచి మొదలుకొని రైతుల ఖాతాల్లో పంట డబ్బులు సకాలంలో జమ అయ్యే వరకు నిరంతర సమీక్షలతో పర్యవేక్షించేవారు. కరోనా కష్టకాలంలోనూ రైతు కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకూ కొని, రైతుల్లో అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలా పండుగలా సాగిన వ్యవసాయంపై మీరు పగబట్టి రైతులకు చేసిన ద్రోహం అందరికీ అర్థమైపోయింది. రైతులు తమ పంటకు నిప్పు పెట్టుకుంటున్నా మొద్దునిద్ర వీడని ముఖ్యమంత్రిని చూసి యావత్తు రైతాంగం శాపనార్థాలు పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి తమ పంటను కాపాడుకొనేందుకు చివరికి టార్పాలిన్లు కూడా సమకూర్చలేని మీ కాంగ్రెస్ సర్కార్ ఉండి రైతులకు ఏం ప్రయోజనం? చాలా చోట్ల చెడగొట్టు వానలు పడి కండ్ల ముందే పంట కొట్టుకుపోతున్నా కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో సంబురంగా సాగిన సాగును కష్టాల కడలిలో ముంచెత్తిన మీ పాపానికి ఇప్పటికే వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. రైతుల ఆర్తనాదాలు ఏమాత్రం వినిపించుకునే తీరిక లేని మీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. మొత్తంగానే వ్యవసాయాన్ని పాతాళంలోకి నెట్టిన మీ దద్దమ్మ పాలనపై ఇప్పటికే రైతుల్లో తిరుగుబాటు మొదలైంది. 60 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టని కాంగ్రెస్
సర్కార్‌కు మరణశాసనం రాసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రమంతా రైతుల నిరసనలు హోరెత్తుతున్న ఈ తరుణంలో 23న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలోనైనా చెంపలేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టండి. వేలాది కొనుగోలు కేంద్రాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ప్రతీ పంటను కొని, వెంటనే రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని అందించండి. అలాగే మీరు చేసిన పాపాలకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వండి. లేకపోతే మీరు చరిత్రలో ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారు.’
జై కిసాన్ జై తెలంగాణ
– కల్వకుంట్ల తారకరామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
