Telangana | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ పెట్టుబడిని రాబట్టేందుకు పలు రాష్ర్టాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఉచిత భూములు, రకరకాల ప్రోత్సాహకాల ఆశ చూపడంతోపాటు తమ రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను ఎత్తిచూపుతూ ఎలాగైన పరిశ్రమను దక్కించుకొనేందుకు ఎవరి మార్గాల్లో వారు ప్రయత్నిస్తున్నారు. ఈ పోటీలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందా? అంటే అవుననే సమధానం వస్తున్నది. టెస్లా ప్లాంటు కోసం రాష్ట్ర సర్కారు అవసరమైన మేరకు ప్రయత్నాలు చేయకపోవడమే ఈ వాదనలకు బలాన్ని చేకూర్చుతున్నది.
టెస్లా కంపెనీని ఆకర్షించేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, కర్ణాటక, తెలంగాణ సైతం రేసులో ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఇప్పటికే అనేక ఆటోమొబైల్ పరిశ్రమలు కొనసాగుతుండటం వాటికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పలు ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఈ రాష్ర్టాల్లో తమ పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తులు చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలకు ఐటీ పరిశ్రమలు అధికంగా ఉండటం కొంత అనుకూలాంశం కాగా, ఈ రెండు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కావడం ప్రతికూలాంశమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. పోటీలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మినహా అన్నింటికీ ఓడరేవు ఉంది. దీంతో ఎగుమతి, దిగుమతులకు ఈ రాష్ర్టాలు అనుకూలంగా ఉన్నాయి. అన్నిటికి మించి మన రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో టెస్లాతో సంప్రదింపులు జరిపినప్పటికీ అనంతరం ఆ ప్రయత్నాలను కొనసాగించకుండా వదిలేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఓడరేవు లేకపోవడం, ఎన్డీఏ కూటమిలోని రాష్ర్టాలతో మనం పోటీ పడే అవకాశం లేదనే భావన ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలిసింది.
ఇదిలావుండగా, దాదాపు నాలుగేండ్ల క్రితం టెస్లా కార్ల తయారీ కంపెనీ భారత్‌కు వస్తున్నట్టు సంకేతాలు వెలువడిన వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దాన్ని తెలంగాణకు వచ్చే విధంగా తీవ్రంగా కృషిచేశారు. నిరంతరం కంపెనీ వర్గాలతో సంప్రదింపులు జరపడమే కాకుండా ఇతర రాష్ర్టాలను తలదన్నే విధంగా తాము ప్రోత్సాహకాలు ఇస్తామని కంపెనీ వర్గాలకు సమాచారం అందించారు. దీంతో తెలంగాణ గట్టి పోటీదారుగా ఎదగడమే కాకుండా టెస్లా భారత్‌కు వస్తే అది తెలంగాణలో ఏర్పాటు ఖాయమనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుతో అంచనాలు తారుమారయ్యాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుంకాలతోపాటు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన సహకారంపై ఆయన లేవనెత్తిన అంశాలకు ప్రధాని సానుకూలంగా స్పందించడంతో టెస్లా కంపెనీ భారత్ రాకకు మార్గం సుగమమైంది. అంతేకాదు, ఇప్పటికే తమకు అవసరమైన ఉద్యోగుల నియామకం కూడా టెస్లా చేపట్టింది. సుమారు 500మిలియన్ డాలర్లతో మొదటి దశ పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటునకు టెస్లా సిద్ధమవుతున్నది.