హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్రం ఎటూ తేల్చలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వ్యవహారంపై స్పష్టత కోసం కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, కమలాకర్‌తో పాటు ఎంపీలు భేటీ అయ్యారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రిని కోరింది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని ప్రశ్నించింది. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రులు వివరించారు. ఆ సమయంలో అమెరికా అధికారిక వాణిజ్య బృందంతో సమావేశమైన పీయూష్ గోయల్.. ఆ భేటీ అనంతరం ఢిల్లీ కృషి భవన్లో తెలంగాణ బృందాన్ని కలిశారు.
మంత్రి కేటీఆర్ బృందం లేవనెత్తిన అంశాలపై 26న తమ నిర్ణయం చెబుతామని పేర్కొంది. ఈ క్రమంలో 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. ధాన్యం కొనుగోలు పరిమితి స్వల్పంగా పెంచేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం పీయూష్ గోయల్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను మంత్రుల బృందం కలిసింది.