రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్1గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయింది. రాష్ట్ర వృద్ధిరేటు మైనస్ 7 అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం రేవంత్‌రెడ్డి అసమర్థత, అనాలోచిత నిర్ణయాల ఫలితమేననే అభిప్రాయముంది. అన్నిరంగాలను ఆగం చేసి, ప్రజలను పీడించిన రేవంత్‌రెడ్డి.. అధికారం అడ్డుపెట్టుకుని చేసిన లూటీ మాత్రం అంతాఇంతా కాదు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇది. అందుకే కాంగ్రెస్ చేతిలో మరోసారి మోసపోవద్దని ఓటర్లను కోరుతున్న. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు షాక్ ఇస్తేనే ఆరు గ్యారెంటీలు అమలవుతయ్. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున 4 లక్షల మంది ఓటర్లు తీర్పునివ్వాలి.
– కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రెండేండ్ల పాలనలో సమస్త రంగాలు విధ్వంసానికి గురైనయి. హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. తద్వారా ఆర్థికంగా అనేక కుటుంబాలు నైరాశ్యంలో కూరుకుపోయినయి. చిరువ్యాపారాలు దెబ్బతిన్నయి. ఇస్తానన్న ఆరు గ్యారెంటీలకు కాంగ్రెస్ ఎగనామం పెట్టింది. మరోసారి మోసపోవద్దు. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున జూబ్లీహిల్స్‌లోని 4 లక్షల మంది తీర్పునివ్వాలి. బీఆర్ఎస్ గెలుపుతో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పాలి. విభజన రాజకీయాలకు చెంపపెట్టులాంటి సమాధానమివ్వాలి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రొఫెషనల్ బ్లాక్‌మెయిలర్ అని, ఎన్నికలో గెలుపుకోసం చేయని అరాచకాలు లేవని నిప్పులు చెరిగారు. 14న రాబోయే ఫలితం సైలెంట్ కాదని, వయిలెంట్‌గా ఉండబోతున్నదని తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో పరిశీలనలు తదితర అంశాలను పంచుకున్నారు. క్షేత్రస్థాయిలో అలుపెరగకుండా, బెదిరింపులకు వెరవకుండా ప్రచారం చేసిన గులాబీ సైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ ముగిసేవరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2023లో 25 లక్షల నుంచి 30 లక్షలు ఉన్న ఫ్లాట్ విలువ ఈ రోజు 15 లక్షలకు పడిపోయింది. అమ్ముదామంటే కొనేటోడు లేడు. ప్రజల ఆత్మస్థయిర్యం దెబ్బతిన్నది. కలలన్నీ కల్లలైనయి. ఏ ఒక్క మనిషిని అడిగినా చెప్తున్నరు. రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. అభివృద్ధి స్తంభించిపోయింది. 2023 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే నంబర్1గా ఉన్న తెలంగాణ, ఇప్పుడు రాష్ర్టాల జాబితాలో చిట్టచివరన 28వ స్థానంలో ఉండటమే నిదర్శనం. రాష్ట్ర వృద్ధిరేటు -7. నెగెటివ్ ఎకానమీ ఉన్నది. ఇది కేవలం రేవంత్‌రెడ్డి అసమర్థత, అనాలోచిత నిర్ణయాల ఫలితమేననే అభిప్రాయమున్నది. రియల్ ఎస్టేట్ అంటే భూములు అమ్మడం, కొనడమేకాదు! మొత్తంగా నిర్మాణ రంగం, స్టీల్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్లు ఇలా లక్షల మంది ఉపాధి పొందుతున్నరు. ఐటీ, రియల్ ఎస్టేట్ బాగుంటే చిరువ్యాపారాలు బాగుంటయి. చైన్ రియాక్షన్. కానీ రేవంత్ సర్కారు తెచ్చిన హైడ్రాతో రియల్ ఎస్టేట్, దాని అనుబంధ వ్యాపారాలు దెబ్బతిన్నయి. 100 రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీల హామీనే నిలపుకోలేదు. అది అటుంచితే రేవంత్‌రెడ్డి తెచ్చిన హైడ్రాతో అది మరింత సంక్షోభంలోకి జారిపోయింది. హైడ్రాతో సామాన్యులను చిదిమేస్తూ, బుల్డోజర్లను స్వైరవిహారం చేయిస్తున్నరు. డిప్యూటీ సీఎంనే ప్రెస్‌మీట్ పెట్టి అనేక ప్రాజెక్టులు అక్రమమని చెప్పారు. మూసీలో అక్రమంగా రెండు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు. మరి వారికి నోటీసులు ఎందుకివ్వలేదు? హైడ్రా సెలెక్టివ్‌గా పనిచేస్తున్నది. దీంతో రియల్ ఎస్టేట్ ఇంకా దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజల తరఫున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయబోతున్నరని ప్రచారంలో స్పష్టమైంది. ఆలోచించి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్తారనేది మా విశ్వాసం. కచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తది. జయకేతనం ఎగరేస్తది.
ఓటింగ్‌లో భారీగా పాల్గొనాలి
జూబ్లీహిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఓటింగ్‌లో పాల్గొనాలి. ఓటింగ్ శాతం పెంచాలి. అవసరమైతే మొదటి గంటలోనే మీ ఓటు వేయండి. షేక్‌పేట, ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌లో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని మాకు సమాచారం ఉన్నది. అందుకే మొదటి గంటలోనే ఓటేయండి. లేదంటే మీ ఓటు వేరే ఎవరో వేస్తరు. అదే కాంగ్రెస్ చేయబోతున్నది. మా అంచనా మాకున్నది.
అధికారంలో ఉన్నది వాళ్లు. వాళ్ల దగ్గర ఉన్న పైసలు మాదగ్గర ఎక్కడున్నయ్? రెండేండ్లలో ఆయన చేసిన లూటీ అంతా ఇంతా కాదు. తిమ్మిని బమ్మిన చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిండ్రు. పేమెంట్ కోటాలో సీఎం అయ్యిండ్రు. కప్పం కడుతూ సీటును కాపాడుకుంటున్నరు. పేమెంట్ల సంగతి సీఎం రేవంత్‌రెడ్డి కంటే గొప్పగా రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ తెల్వది. 14న ఎవరు గెలుస్తారు? ఏది పేమెంట్ అనేది తెలుస్తది. బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి కండ్లముందున్నది. ఇక కాంగ్రెస్ గెలిస్తే రౌడీషీటర్ల పాలవుతుందని, హఫ్తా వసూలు మొదలవుతాయని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇంటికి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో? అని రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పకపోతే అరాచకం మరింత పెరిగిపోతుందనే భయాలు జూబ్లీ ప్రజల్లో అంతటా కనిపిస్తున్నయి. భయంతో చాలా మంది బయటకు చెప్పకున్నా బీఆర్ఎస్ రావాలి, గెలవాలని 100 శాతం ప్రజలు కోరుకుంటున్నరు. సైలెంట్ ఓటు వయిలెంట్గానే విజయం. కాంగ్రెస్‌కు సౌండ్ వినబడ్తది. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసిన వాళ్లకు మంచి సౌండ్ వినపిస్తది. 2023లో 16 వేల మెజార్టీతో జూబ్లీహిల్స్ గెలిచినం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తం. మెజార్టీ తగ్గదు. ఉప ఎన్నిక ఫలితాలతో చాలా మందికి కండ్లు తెరచుకుంటయి. హిందూ, ముస్లింలు అని మాట్లాడేవాళ్లు, ప్రజల్లో ఉద్వేగాలు రెచ్చగొట్టి గెలవాలని చూసేవాళ్లకు, ముస్లింలను ఓటుబ్యాంకుగా చూసే రాజకీయాలకు సరైన గుణపాఠం చెప్తుందిది. ఎలక్షన్ జరుగుతున్నది రెండు టీముల మధ్యనే. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా ఇచ్చి తీరాలని గల్లాపట్టి నిలదీస్తున్న బీఆర్ఎస్ టీము, గ్యారెంటీలను ఎగ్గొట్టి, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ టీముకు మధ్యనే పోటీ. బీజేపీ పోటీలోనే లేదు.

ఏం అభివృద్ధి? ఎనుముల బ్రదర్స్ అభివృద్ధా? కాంగ్రెస్ మంత్రులు బజార్లకు ఎక్కి కొట్లాడుకునే అభివృద్ధా? పారిశ్రామిక వేత్తల తలలకు తుపాకులు పెట్టే అభివృద్ధా? రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసి ప్రజల ఆస్తిని హారతి కర్పూరంలా చేసిన అభివృద్ధా? నిధులివ్వండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే వరల్డ్ బ్యాంకుకు అర్జి పెట్టుకునే అభివృద్ధా? 6 వేల ఇండ్లు ఇస్తామని చెప్పి కంటోన్మెంట్లో గెలిచి, ఇప్పటివరకు 6 ఇండ్లు కూడా మంజూరు చేయని అభివృద్ధా? నేను అడుగుతున్నా.. రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పి ఓట్లు అడగండి. మా పార్టీ ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌లో రూ.5,328 కోట్లతో అభివృద్ధి చేసినమని లెక్కలతో సహా చెప్పిన. ఒక్క మంత్రైనా సమాధానం చెప్పిండ్రా? ముఖ్యమంత్రేమో రెండేండ్లది చెప్పడు కానీ, 2004-2014 వరకు చెప్తరట! రెండేండ్లలో ఏం చేశారో చెప్పుకోలేని అశక్తత, దారిద్య్రానికి ఇంతకు మించి సూచిక ఏముంటది? ఇది దిగజారుడు రాజకీయం. ముఖ్యమంత్రి గురించి మాకన్నా ప్రజలకు బాగా అర్థమైంది. ఎన్నికల ముందు 10 వేల కోట్లు కావాలా తీసుకో అంటడు. ఎన్నికలైపోతే నా దగ్గర ఎక్కడున్నయ్ పైసలు, ఢిల్లీకి పోతే దేకుతలేరు.. చెప్పులు ఎత్తుకుపోతా అన్నట్టు చూస్తున్నరు అంటడని ప్రజలే చెప్తున్నరు. అందుకే ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నరు. 2015 నుంచి 2023 దాకా హైదరాబాద్ ప్రజలు మాకు 4 సార్లు ఓట్లేశారు. ప్రజలు అమాయకులా? 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్, నిరంతరం కరెంటు వెలుగులు ఇచ్చారు కేసీఆర్. 42 ఫ్లై ఓవర్లు కట్టినం. తెలంగాణలో 350 బస్తీ దవాఖానలు పెట్టింది నిజం కాదా? అన్నపూర్ణ సెంటర్లు నిజం కాదా? కేసీఆర్ కిట్లు నిజం కాదా? 15 లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసింది నిజం కాదా? టిమ్స్ కట్టింది నిజం కాదా? డ్రైవర్లను ఓనర్లను చేసినం. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? మస్రత్ అలీ అనే రెండు ఆటోల ఓనర్ ఉండేవాడు. రాహుల్‌గాంధీ ప్రచారంలో ఆయన ఆటోనే ఎక్కి తిరిగిండు. ఇప్పుడు ఆయన ఓనర్ నుంచి డ్రైవరైండు. ఇదీ కాంగ్రెస్ పాలన. హైదరాబాద్‌లో ఎవరూ మోసపోలే. జిల్లాల్లో ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజలను మోసగించిన్రు. రైతుబంధు పెంచుతామని, కౌలు రైతులకు ఇస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలు హామీలిచ్చి మోసం చేసిండ్రు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయినయి. బండి సంజయ్ మాటల్లో సెన్స్ తక్కువ.. నాన్సెన్స్ ఎక్కువ. ఎప్పుడన్న కేంద్ర మంత్రిలా మాట్లాడితే బాగుండేది. కేవలం రేవంత్‌రెడ్డికి సహాయకారిగా మాట్లాడుతడు. రేవంత్‌రెడ్డి కష్టాల్లో ఉంటే బండి వస్తడు. హిందూ, ముస్లిం అని మాట్లాడుతడు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ కాదు. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్‌గా నడుపుతున్న ప్రభుత్వం. పొంగులేటి దాడులపై ఎవరూ నోరుమెదపరు. వక్ఫ్ బిల్లు చట్టమైనంక వెంటనే దాన్ని అమలు చేసేందుకు మొట్టమొదట జీవోను తెచ్చింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. 2 కోట్ల వార్షిక టర్నోవర్ మాత్రమే ఉన్న రేవంత్‌రెడ్డి బావమరిది కంపెనీకి కేంద్రం రూ.1,150 కోట్ల కాంట్రాక్టు ఇస్తది. బీజేపీ నాయకుడు సీఎం రమేశ్ కంపెనీకి రూ.1,350 కోట్ల కాంట్రాక్టును రేవంత్‌రెడ్డి అప్పగిస్తరు. కాంగ్రెస్, బీజేపీ పరస్పర సహకారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? సీబీఐ మోదీ జేబు సంస్థ అని రాహుల్‌గాంధీ అంటరు. మరి అలాంటి సీబీఐకి కాళేశ్వరం కేసు అప్పగించడమంటే ఏమిటీ అర్థం? ఇప్పుడు కూడా మహిళా సంఘాలకు 5 వేలు, చీరలిస్తున్నరు. మెడికల్ షాపుల వాళ్లకు, ఇస్త్రీ షాపుల వాళ్లకు ఇస్తున్నరు. సెలూన్లకు ఇస్తున్నరు. కోట్లలో ఖర్చు పెట్టిండ్రు. పంపకాలు జరిగిపోయినయి. ఇన్ని జరుగుతున్నా సోదాలు, దాడులు మాత్రం బీఆర్ఎస్ మీదనే జరుగుతున్నయ్. కాంగ్రెస్‌కు చెందిన ఒక్కరిపై, అదీ మా బలవంతంతోనే. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయినయి. మేం ఎవరినీ నమ్ముకోవాలి? ప్రజలను నమ్ముకోవాలి. అందుకే స్రీన్లు పెట్టి మరీ చెప్తున్నం. ఎన్నికల్లో ఒక వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టినం. కాంగ్రెస్ ఏం చెప్పింది? ఏం చేస్తున్నది చూపించినం. ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇండ్లు కూలగొడుతున్నది. అది తట్టుకోలేక ఉక్రోశంతో మా అభ్యర్థి కుటుంబ పరమైన అంశాలను కూడా రాజకీయంగా లాగి, వాళ్ల కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి, ఎగేసి, ఒక్క సీటు కోసం ఇంతగా దిగజారాలా? కేసీఆర్‌కు, మా అభ్యర్థికి క్షమాపణ చెప్పమనండి. పోటీ నుంచి తప్పుకొంటం. .
ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందన ఉన్నది. ప్రచారంలో నేను స్వయంగా చూసిన. కాంగ్రెస్ రూ.5 వేలు ఇచ్చినా ఇంకా రూ.55 వేలు బాకీ ఉంటదని అంటే చాలు మహిళలు నవ్వుతున్నరు. బాకీకార్డు జనాల్లోకి వెళ్లిందనేదానికి నిదర్శనం అదే. బాకీ కార్డు సూపర్ హిట్టయ్యింది. రాబోయే రోజుల్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తయి. బాకీ కార్డు ఎంత హిట్టయ్యిందంటే నిరుద్యోగులు నిరుద్యోగ బాకీ కార్డు, ఆటోవాలాలు ఆటో బాకీ కార్డు, మైనార్టీ బాకీ కార్డు ఇట్ల ఎవరి లెక్కలు వారు పెట్టుకుంటున్నరు.
గోపీనాథే మా బలం..
గోపీనాథ్ బీఆర్ఎస్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీలోనూ సుశిక్షుతుడైన సైనికుడు. ఆయనే మా బలం. అన్నింటినీ తట్టుకుని మాజీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు కూడా క్లస్టర్ స్థాయిలో కూడా పనిచేశారు. వెరవకుండా ప్రచారంలో పాల్గొన్న, కేసీఆర్ సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లిన గులాబీ శ్రేణులకు హ్యాట్సాఫ్. తెలంగాణ భవన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఆనుకొనే ఉన్నది. భవన్లో నాతోసహా పార్టీ నాయకత్వం మొత్తం అందుబాటులో ఉంటది. బీఆర్ఎస్ను గెలిపిస్తే సునీతకు అండగా నిలబడుతం. 25 మంది ఎమ్మెల్యేలమంతా అందుబాటులో ఉండి సేవ చేస్తం.
ఇప్పటికే దొంగ ఓట్లు రాయించిండ్రు. ఓటర్లను బెదిరించిండ్రు. మా లీడర్లను బెదిరించిండ్రు. డబ్బులు కుమ్మరించిండ్రు. సామదానభేద దండోపాయాలు ప్రయోగించిండ్రు. మా నాయకుడి షాపు తగలబెట్టిండ్రు. ఒకాయనను ఇల్లు కూలగొడతమని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకున్నరు. ఒకరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకునిపోయిండ్రు. చాలా చేస్తున్నరు. మేం కూడా పదేండ్లు గవర్నమెంట్లో ఉన్నం. 4 ఎలక్షన్లు కొట్లాడినం. ఏనాడూ అరాచకం చేయలే. కాంగ్రెస్ ఇప్పుడు మాకు కొత్త అనుభవాలు, కొత్త కొత్త విషయాలు నేర్పిస్తున్నది. అవతల కాంగ్రెస్ పార్టీని కోట్ చేస్తున్నవారు రౌడీ నేపథ్యమున్నవారు. కొంత నేర చరిత్ర కలిగినవారు. ముఖ్యమంత్రి కూడా రౌడీవేషాలు వేస్తున్నరు. అన్ని జరిగినా 16 వేల పైచీలుకు మెజార్టీతో గెలుస్తం. 14వ తేదీ తర్వాత పరిస్థితుల్లో మార్పు ఉంటది. అతిచేస్తున్న పోలీసులను, అధికారులను గుర్తుపెట్టుకొని మరీ లెక్కలు సెటిల్ చేస్తం.
ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కేసీఆర్‌ను తలవని ఒక్క స్పీచ్ చూపెట్టండి. ముఖ్యమంత్రి మనసునిండా, ప్రతి కాంగ్రెస్ మంత్రి గుండెనిండా కేసీఆర్ ఉన్నడు. ఆయనను తలచుకోకుండా నిద్రపోతలేరు. ఇవాళ కేసీఆర్ తీర్చిదిద్దిన కార్యకర్తలుగా, శిష్యులుగా మేం అందరం ఫీల్డ్‌లో ఉన్నం. కేసీఆర్ సందేశాన్నే కదా ఇంటింటికి తీసుకుపోతున్నం? కేసీఆర్ మా బ్రహ్మాస్త్రం. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తరు. ఆయనే నిర్ణయించుకుంటరు. పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సాధించిన నాయకుడు. ఆయనకున్న అవగాహన, అనుభవం మాకులేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు.
ఇంతకుముందు చెప్పినం. మళ్లీ చెప్తున్నం. జూబ్లీహిల్స్, తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒక్కటే. బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు తేల్చగానే అజార్‌కు మంత్రి పదవి వచ్చింది. సినీ కార్మికులకు వరాలు కురిపించిండ్రు. కుల సంఘాలకు వరాలు గుప్పిస్తున్నరు. ఎన్టీ రామారావు, పీజేఆర్ గుర్తుకు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీలు పట్టుకొని పాదయాత్ర చేస్తున్నరు. చీరలు, పైసలు పంచుతున్నరు. బీఆర్ఎస్ గెలుస్తుందనే భయంతోనే ఇంత చేస్తే, గెలిస్తే చచ్చినట్టు ఆరు గ్యారెంటీలు అమలవుతయి. కడుపుమీద కొట్టిన కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి సమాధానమివ్వాలి. ఆలోచించి ఓటెయ్యండి. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఇప్పటికి చాలా సార్లు మోసపోయిండ్రు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రొఫెషనల్ బ్లాక్‌మెయిలర్. ఈ రోజు కాదు, ఆర్టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడమే ముఖ్యమంత్రి నైజం. చదువుకోలేదు. వ్యాపారాలు చేయలేదు. డబ్బులు ఎట్లా వచ్చినయి? పిల్లనిచ్చిన మామ జయపాల్రెడ్డినే బ్లాక్మెయిల్ చేసిన ఘనుడు. సెటిల్మెంట్లు చేసేటోడు సెంటిమెంట్ల గురించి మాట్లాడితే దరిద్రంగా ఉంటది. బ్లాక్మెయిల్ చేసేవాడు, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నడు. ఇప్పుడు కూడా అదే జేస్తున్నడు. డీఏ, పీఆర్సీ అడితే ఉద్యోగులను బెదిరిస్తడు. కోసుకుతింటరా? అంటడు. రీయింబర్స్మెంట్ అడిగితే విజిలెన్స్ దాడులు చేయిస్తడు. ఉద్యోగాల సంగతి అడిగితే నిరుద్యోగులను లాఠీలతో కొట్టిస్తున్నడు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నడు. పథకాలు రద్దు చేస్తానని బెదిరిస్తున్నడు. రెండేండ్లు గడిచినయ్. మరి ఇప్పటికీ 40 లక్షల మందిని కోటీశ్వరులను చేయాలి కదా? ఎక్కడ చేశారో చూపించండి? కౌన్ బన్‌గయా కరోడ్ పతి? చూపెట్టండి. అందుకే మళ్లీ పోవద్దనేది నా విజ్ఞప్తి.