విశ్వం ఒక యాదృచ్ఛిక శక్తి కాదు. అది శాస్త్రీయ సూక్ష్మతతో, ఆధ్యాత్మిక సత్యాలతో నడిచే సజీవ చైతన్యం. ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది? మన ఆలోచనలు ఎందుకు వాస్తవమవుతాయి? మన చైతన్యం ఎందుకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని మార్చేస్తుంది? ఇవే ప్రశ్నలకు సమాధానంగా వెలువడిన అరుదైన గ్రంథమే ‘విశ్వ నియమాలు-విశ్వ రహస్యాలు’.
ఈ పుస్తకం విశ్వాన్ని కేవలం ఆరాధించాల్సిన దైవశక్తిగా కాకుండా, శాస్త్రీయంగా పరిశోధించాల్సిన జీవచైతన్య వ్యవస్థగా వివరిస్తుంది. రచయిత డాక్టర్ లక్కరాజు నిర్మల 12 విశ్వ నియమాలను ఆధునిక క్వాంటం ఫిజిక్స్, తాత్విక అనుభూతి, నాడీవ్యవస్థ, షట్చక్రాలు, పంచభూతాల అనుసంధానంతో సమగ్రంగా వివరించారు.
ఆధ్యాత్మిక దృక్కోణం: ఒక చిన్న విశ్వం (మనిషి, అంటే పిండాండం), బాహ్య విశ్వం (బ్రహ్మాండం) పరస్పరం స్పందిస్తాయని ఈ గ్రంథం ఆలోచనాత్మకంగా ఆవిష్కరిస్తుంది. చక్రాలు యంత్రాలు కాదు చైతన్య కాంతి కేంద్రాలని, వాటి శుద్ధి ద్వారా మనిషి తన జీవిత గమ్యాన్ని స్వయంగా రూపొందించుకోగలడని ఈ పుస్తకం నిరూపిస్తుంది. ధ్యానం, సంకల్పం, శబ్ద తరంగాలు (సప్త స్వరాలు), వృక్ష శక్తులు, గ్రహసూక్ష్మ ప్రభావాల ద్వారా విశ్వంతో సంభాషించే మార్గాలను రచయిత అందించారు.
శాస్త్రీయ దృక్కోణం: క్వాంటం ఫిజిక్స్ చెప్తున్న Everything is Energy అనే సత్యాన్ని, మన ఆలోచనలు సృష్టించే వైబ్రేషన్లతో రచయిత సమకాలీకరిస్తారు. లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ ఇంటెన్షన్ వంటి నియమాలను శాస్త్రీయ ప్రయోగాలు, ప్రపంచ పరిశోధనలు, మెదడు న్యూరోప్లాస్టిసిటీ ఆధారంగా వివరించడం ఈ పుస్తక ప్రత్యేకత.శబ్దం = ఫ్రీక్వెన్సీ = సృష్టి మూలం
అన్న సూత్రాన్ని వేద సూక్తులు, ఆధునిక శాస్ర్తానికి మధ్య వంతెనగా చూపించారు.
12 నియమాల సమగ్రత: ఈ పుస్తకం కేవలం సిద్ధాంత పునాదుల గ్రంథం కాదు;
ఇది జీవన విధాన మార్గదర్శి. చైతన్య రూపాంతర గ్రంథం. ఆరోగ్య, ఆర్థిక, భావోద్వేగ సమస్యలకు పరిష్కార నిధి. ప్రతి మనిషి తన సొంత వాస్తవాన్ని ఎలా నిర్మించుకోవాలో బోధించే శాస్త్రీయ ఆధ్యాత్మిక పరికరం.
పుస్తక విశేషాలు: పంచభూతాలు మానవ శరీరం మధ్య శక్తి వినిమయ రహస్యాలు. చక్రాల శుద్ధి ద్వారా దివ్యశక్తిని స్వీకరించే పద్ధతులు, నవగ్రహాల సూక్ష్మ ప్రభావాలు. సంపద, ఆరోగ్యం, ఆత్మశాంతి పొందడానికి విశ్వ నియమాలను కార్యాచరణలో ఎలా ఉపయోగించాలో అనువర్తన పద్ధతులు వివరించారు. సంక్షిప్తంగా ఈ పుస్తకం చదివే ప్రతి వ్యక్తి నేను విశ్వంతో వేరు కాదు, విశ్వమే నేను అనే స్థితికి చేరుకుంటారు. ఇది కేవలం పుస్తకమే కాదు, మనిషి చైతన్యాన్ని మేల్కొలిపే శాస్త్రసూత్రాల సత్య గ్రంథం. ఆధ్యాత్మికతకు శాస్త్రీయ భాష, శాస్ర్తానికి ఆధ్యాత్మిక హృదయం ఇచ్చిన గ్రంథం ఇది. ప్రపంచం మారుతుంది, అయితే ముందుగా మనలోని చైతన్యం మారాలనే సత్యాన్ని ఈ పుస్తకం శాస్త్రీయంగా
నిరూపిస్తుంది.
-కొండపల్లి నీహారిణి
9866360082