జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర వృక్షం, అత్యంత పవిత్రమైనదిగా భావించే ఖేజ్రీ వృక్షాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న నిరసనలు, నిరవధిక దీక్షలకు బీజేపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఖేజ్రీ వృక్షాన్ని కాపాడేందుకు ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ శనివారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఖేజ్రీ చెట్టును పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.
కాగా, గురువారం బికనేర్ కలెక్టరేట్ వద్ద నిరసనకారులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షను విరమింపచేయడానికి రాష్ట్ర మంత్రి బిష్ణోయ్ ప్రయత్నించారు. నిరసనకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసేందుకు ఆయన ప్రయత్నించారు. జోధ్‌పూర్, బికనేర్ డివిజన్లలో ఖేజ్రీ చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తామని ఆయన ఇచ్చిన హామీపై నిరసనకారులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఖేజ్రీ వృక్షాల నరికివేతపై నిషేధం విధించే వరకు తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని నిరసనకారులు ప్రకటించడంతో ప్రభుత్వంలో కూడా చలనం వచ్చింది.