హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్-2 నిర్వహణకు రంగం సిద్ధమైంది. విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. యేటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ రిలీజ్ కోసం అధికారులు ఫైల్ రెడీ చేశారు. ఈ విడతలో టీచర్లకు టెట్ రాసే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం టెట్ అర్హతలు, నిబంధనలకు సంబంధించిన జీవో సవరించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 45 మంది ఉపాధ్యాయులు పరీక్షరాయనున్నారని వెల్లడించారు. ప్రభు త్వం అనుమతిస్తే వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నామని పేర్కొన్నారు.
పలు అంశాలపై ఆస్కీ,ఎన్టీఏ ఎంవోయూ
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) అనుబంధ నేషనల్ ట్రైనింగ్ అకాడమీ(ఎన్టీఏ) మధ్య భాగస్వామ్యం కోసం పరస్పర అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. శనివారం ఆస్కీ (బెల్లావిస్టా క్యాంపస్)లో జరిగిన కార్యక్రమంలో ఆస్కీ రిజిస్ట్రార్, కార్యదర్శి ఓపీ సింగ్, ఎన్టీఏ డైరెక్టర్ సునీతాదరి అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి, పరిశోధనా కార్యక్రమాలు, కన్సల్టెన్సీ ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ మార్పిడి, వనరుల వినియోగం, ఆరోగ్యబీమా, పబ్లిక్ పాలసీ, పరిశోధన, డాటా అనలిటిక్స్, డాటా రక్షణ, డిజిటల్ పరివర్తన, సేకరణ తదితర రంగాల్లో పరస్పర అవగాహనతో పనిచేయనున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. కార్యక్రమంలో ఆస్కీ డీన్ సుబోధ్ కండముతన్, ఈఎస్ఐసీ ప్రతినిధి రీతామహాజన్ తదితరులు పాల్గొన్నారు.