తెలుగులో శ్రీనాథుడు రచించిన ‘శివరాత్రి మహత్యము’ ప్రసిద్ధం. అదికాక లోకేరావు సోమన అనే కవి రచించిన ‘శివరాత్రి మహత్యం’
అని కూడా ఒకటి ఉంది. ఆ రచన తెలుగులోని ‘అలభ్య కావ్యముల’ జాబితాలో చేరి ఉంది. అయితే ఆ కావ్యం అలభ్యమన్న
మాటలో నిజం లేదు. చెన్నైలోని గవర్నమెంట్ ఓరియంటల్ మానుస్క్రిప్ట్స్ లైబ్రరీలో లోకేరావు సోమనమంత్రి రచించిన ‘శివరాత్రి మహత్యము’ తాళపత్ర ప్రతి (Accession No.R 1753) అందుబాటులో ఉంది. మూడాశ్వాసముల ఈ ప్రబంధానికి సంబంధించిన 64 పుటల తాళపత్ర ప్రతి ఇది.
వ్రాత ఒక మోస్తరుదే అయినప్పటికీ, క్రిమిదష్టమవడం వలన తాళపత్రాల చివరలు పోయి, కొన్ని చోట్ల రంధ్రాలు పడటం వల్ల అక్షరాలు చాలాచోట్ల చెరిగిపోయి ఉన్నాయి. ఆశ్వాసాంతంలో ‘ఇది శ్రీమన్మహా మహేశ్వర కరుణా కటాక్ష వీక్షణాలంకార, కవితా చమత్కార లోకేరావుతరాన్వయ పవిత్ర ధర్మయమంత్రి పుత్ర సహజ పాండిత్య సోమనామాత్య ప్రణీతంబైన వీరమాహేశ్వరాచార సంగ్రహంబను మహాపురాణోక్తంబగు శివరాత్రి మహత్యంబునందు..’ అని ఉండటం వలన రచన కర్తృత్వానికి సంబంధించిన సందేహానికి తావు లేదు.
అదలా ఉన్నప్పటికీ, కావ్యానికి సంక్షిప్త అవతారికలోని ఈ క్రింది పద్యాల వల్ల కూడా కావ్యకర్తృత్వ విషయం నిర్ధారితమవుతుంది. మొదటి పద్యంలోని రెండు, మూడు పాదాలలో ఖాళీగా వదిలేయబడిన చోట్ల తాళపత్ర ప్రతిలో అక్షరాలు చెరిగిపోయి చదవడానికి వీలులేకుండా ఉన్నాయి.
సీ. శ్రీరమ్యుడచల ప్రసిద్ధుండు హరితస
గోత్రాంచితశ్వలాయనను గభీరు
వెలయ లోకేరావు……… కూరిమి
పత్ని సుశీల గర్భ……… నందు
గనియె……… జన్మ ఘన బ్రేమ మరియు
శ్రీధర్మ పురీశు సత్కరుణ కతన
వంశతిలకుని మంత్రివరుని సత్యసంధు
సద్బుధు చింతామణి ప్రకట యశుని
గీ. ధర్మమూర్తికతుల ధర్మాత్ముడగు వాని
ధర్మ నార్యుడనెడి తనయు గనియె
నతడు వేడ్క లక్కమాంబయు తన
ధర్మపత్ని గాను మనియె పరిఢవమున.
గీ. సర్వమంగళండ్రు సర్వమంగళకాంతి
లక్ష్మీదేవియండ్రు లక్ష్మీకళల
వాగ్విలాసమునను వాగ్దేవియండ్రు
మాధర్మనార్యు లక్ష్మీధాము బుధులు.
కం. అక్కమల వాణి గిరిజయు
దక్కన్మరి లోకేరావు ధర్మియు సతియా
లక్కమతోడను సరిగా
దక్కొరు ఇంతులను జెప్పదగునే పుడమిన్.
గీ. సొంపు మీరగనా మంచి దంపతులకు
యేము మువ్వురు తనయుల మీకు కరుణ
కులపవిత్రులు విఠన కొండ ఘనుల
కగ్రజాతుండ సోమనాహ్వయుండ నేను.
కం. యేనొగి జెప్పెడి కృతికిని
తానాయకుడైన లోక దక్షున్ ప్రమధా
ధీనుని భూతేశుని పం
చానన శంకరుని పేర నభినుతి జేతున్.
పై పద్యాల వలన, లోకేరావు సోమన తల్లిదండ్రులు లక్కమాంబ, ధర్మయమంత్రి అని, వారు హరితస గోత్రులు, అశ్వలాయన సూత్రులని, వారికి జన్మించిన ముగ్గురు కుమారులలో సోమన అగ్రజుడని, శ్రీ ధర్మపురీశుడు వారి ఇలవేలుపు, వారు కొలిచే దైవం అని తెలుస్తుంది. తెలంగాణలో జగిత్యాలకు దగ్గరలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి. దక్షిణకాశీగా ఈ క్షేత్రానికి పూర్వం నుంచి పేరుంది. ఈ క్షేత్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ధర్మపురీశుడుగా ప్రసిద్ధుడు. శ్రీ ధర్మపురీశుడు ఇలవేలుపుగా కలిగిన లోకేరావు సోమన కుటుంబం తెలంగాణ ప్రాంతానికి చెందినవారనడంలో సందేహించాల్సింది లేదు.
-భట్టు వెంకట్రావు
9959120528