KTR | రైతుబంధు పాలనపోయి రేవంత్ రాబందు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోసపడుతున్నారని అన్నారు. రైతులు చలిలో చెప్పులు క్యూలైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ప్రేమ లేదని అన్నారు. కేసీఆర్ హయాంలో యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని సర్పంచ్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అలవిగాని, అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే అన్ని ఎక్కువిస్తామని ప్రజలను ఆశపెట్టారని చెప్పారు. రెండేళ్లు పూర్తయినా ఏమైనయ్ పథకాలను అడిగితే రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నాడని మండిపడ్డారు. మహాలక్ష్మీ పథకం ఏమైందంటే గుడ్లపీకి గోటీలాడతానంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశారని గుర్తుచేశారు. రెండేళ్లలో 10 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని తెలిపారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.కాంగ్రెసోళ్లు పాలమూరు అంటేనే వలసల జిల్లాగా మార్చారని మండిపడ్డారు. ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టారని చెప్పారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. వైకుంఠధామాలు కట్టామని.. డంప్ యార్డులు కట్టామని చెప్పారు. దేశంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డులు 30 శాతం మనకే వచ్చేవి అని అన్నారు. ప్రతి గ్రామాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అని కొనియాడారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పడకేసిందని తెలిపారు. రేవంత్ పాలనలో ట్రాక్టర్లలో డీజిల్ లేదు.. వీధి లైట్లు లేవని అన్నారు.
నేను ఆంధ్రాలో చదివితే నీకు నొప్పయితే.. నీ అల్లుడిది భీమవరం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి భీమవరం బుల్లెబ్బాయ్ పేరు సరిపోతుందని తెలిపారు. మా నాయన కేసీఆర్ 1984లోనే ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఎంఎస్ బయోటెక్నాలజీ, ఎంబీఏ చదివానని పేర్కొన్నారు. మన ఇంట్లో మనం పనిచేసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. రేవంత్ ఎక్కడికి పోయినా ఆవు కథ లెక్క కేసీఆర్ మీద ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే రేపోమాపో కరుస్తాడేమో అని అనిపిస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే యూరియా బస్తాలు దొరికేలా చేస్తానని శపథం చెయ్ అని సవాలు విసిరారు. రూ. 4వేలు పెన్షన్ ఇస్తా అని శపథం చెయ్ అని అన్నారు. బంగారంలాంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. గతంలో ఎట్లుండే నాగర్‌కర్నూలు ఇప్పుడు ఎలా తయారైందని ప్రశ్నించారు.