Calcium Deficiency Symptoms | శరీరం క్రమం తప్పకుండా పనిచేయాలంటే మనం పోషకాలను శరీరానికి నిరంతరం అందిచాల్సి ఉంటుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాలను మనం అందించినప్పుడే మన శరీరం సాఫీగా క్రియలను నిర్వర్తిస్తుంది. విటమిన్లు వంటి పోషకాలు మనం తినే ఆహారం నుండి శరీరం శక్తిని ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. ఇక ఖనిజ లవణాలు శరీర ప్రక్రియలను నిర్వర్తించడంలో సహాయపడతాయి. మన శరీరానికి కావల్సిన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి క్యాల్షియం చాలా అవసరం. అస్థిపంజర నిర్మాణానికి కూడా క్యాల్షియం చాలా అవసరరం. అలాగే రక్తనాళాల సంకోచానికి, వాటి విస్తరణకు, కండరాల సంకోచానికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా క్యాల్షియం చాలా అవసరం.
కానీ మనలో చాలా మంది క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. రక్తంలో క్యాల్షియం తక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలహీనంగా , పెళుసుగా మారడం, చిన్న గాయాలకే ఎముకలు విరగడం, ఆస్టియోపోరోసిస్, దంతాలు వదులవ్వడం, దంతాల సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. అలాగే నీరసం, అలసట, కండరాల సమస్యలు, చర్మం మంట రావడం జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల గోర్లు పెళుసుగా మారడం, ప్రోమెన్స్ట్రువల్ సిండ్రోమ్ బారిన పడడం జరుగుతుంది. క్యాల్షియం లోపం వల్ల డిప్రెషన్ వంటి మానసికపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక 50 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్న మహిళలకు రోజుకు 1000 మిల్లీగ్రాములు, 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది.
అదేవిధంగా 70 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్న పురుషులకు 1000 మిల్లీగ్రాములు, 70 ఏళ్లు పైబడిన పురుషులకు 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. మనలో చాలా మంది క్యాల్షియం లోపం నుండి బయటపడడానికి వైద్యుల సలహా మేరకు క్యాల్షియం సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. కానీ మనం తీసుకునే ఆహారాల ద్వారా కూడా మనం క్యాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం తగ్గడంతో పాటు మొత్తం శరీరానికి కూడా మేలు కలుగుతుంది. క్యాల్షియం లోపంతో బాధపడే వారు తీసుకోదగిన ఆహారాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. క్యాల్షియం లోపాన్ని తగ్గించడంలో పాల ఉత్పత్తులు మనకు ఎంతో సహాయపడతాయి.
పాలు, పెరుగు, చీజ్, పనీర్, వెన్న వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే నారింజ, ఆప్రికాట్, కివి, ఖర్జూరాలు, మల్బెర్రీ, అంజీర్, బొప్పాయి, ఎండుద్రాక్ష, జామ, పైనాపిల్స్ వంటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన క్యాల్షియం లభిస్తుంది. పాలకూర, చిలగడదుంపలు, బీట్రూట్, గుమ్మడికాయ, బ్రస్సెల్స్, బ్రోకలీ వంటి కూరగాయల్లో కూడా క్యాల్షియం ఉంటుంది. ఈ ఆహారాలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా అందుతాయి.