Viral news : నాగరికత పేరుతో నగరాల్లో సహజీవనం చేయడం, వివాహానికి ముందే గర్భం దాల్చడం, ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి వ్యవహారాలను తమ గ్రామంలోకి అడుగుపెట్టకుండా చేసేందుకు చైనాలోని యునాన్ రాష్ట్రం లిన్కాంగ్ జిల్లాలోగల ఓ గ్రామస్థులు కఠినమైన నిబంధనలు పెట్టుకున్నారు. ఈ మేరకు గ్రామ పెద్దలు ఓ తీర్మానం చేశారు.
ఆ నిబంధనల ప్రకారం.. గ్రామంలో ఎవరైనా వివాహం కాకుండా కలిసి ఉంటే ఏటా 500 యువాన్లు (సుమారు రూ.6 వేలు) జరిమానాగా చెల్లించాలి. అదేవిధంగా పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి 3,000 యువాన్లు (రూ.38,472) పంచాయతీకి కట్టాలి. పెళ్లయిన తర్వాత 10 నెలల లోపే బిడ్డను కంటే కూడా అంతే మొత్తం ఫైన్ చెల్లించాలి.
అదేవిధంగా ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ.19 వేలు), దంపతులు గొడవపడి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు (సుమారు రూ.6 వేలు), మద్యం సేవించి గ్రామంలో గొడవ చేస్తే 3 వేల నుంచి 5 వేల యువాన్లు (రూ.38,472 నుంచి రూ.64,120), నిరాధార ఆరోపణలు, పుకార్లు సృష్టిస్తే 500 నుంచి 1,000 యువాన్లు (రూ.6,412 నుంచి రూ.12,824) జరిమానా చెల్లించాలని పెద్దలు నిర్ణయించారు.
ఈ మేరకు ఓ బోర్డును తయారు చేసి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటుచేశారు. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నియమాలు అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. అయితే అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వెంటనే ఆ బోర్డును తొలగించారు.