కేంద్ర బడ్టెట్‌లో మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు నిధులు లేవు. 30-40 లేఖలు రాసినా ఒక్క దానికీ కేంద్రం నుంచి జవాబు రాలేదు. కరోనా నేపథ్యంలో అన్ని రాష్ర్టాల మాదిరిగా విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతి కోరినా.. కేంద్రం నిరాకరించింది. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో 157 మెడికల్ కళాశాలలు, 16 ఐఐఎం, 87 నవోదయ పాఠశాలలు, 12 ఐసీఆర్, ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసినా.. రాష్ర్టానికి ఇచ్చింది గుండుసున్నా. విద్యాసంస్థలు ఇవ్వరు.. నిధులు ఇవ్వరు.. తెలంగాణకు కేంద్రం ఏ రకంగానూ సహకరించదు. ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం పంచాయితీలు పెట్టి, చిల్లర మల్లర మాటలు మాట్లాడుతారు. – మంత్రి కేటీఆర్
మేడ్చల్, ఫిబ్రవరి 2 : రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ దేశంలో తెలంగాణ అంతర్భాగంగా లేదన్నట్టు వ్యవహరిస్తున్నదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులివ్వాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. తాజా బడ్జెట్లో మొండిచెయ్యి చూపిందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలో బుధవారం రూ.380 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బడ్జెట్లో రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగలేదని తెలిపారు. దేశానికి బువ్వ పెట్టే రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో అతి పెద్ద రాష్ట్రమని, అయినా కేంద్రం తెలంగాణను శత్రు రాష్ట్రంగా పరిగణిస్తున్నదని ఆరోపించారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టంచేశారు.
తెలంగాణ దేశానికే కొత్త నమూనా
సంక్షేమం, అభివృద్ధిలో కొత్త నమూనాను దేశానికి పరిచయం చేసిన ఘనత తెలంగాణదేనని కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్టెట్‌లో మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు నిధులు లేవని, 30- 40 లేఖలు రాసినా ఒక్క దానికీ కేంద్రం నుంచి జవాబు రాలేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని రాష్ర్టాల మాదిరిగా విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతి కోరినా.. కేంద్రం నిరాకరించిందని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో 157 మెడికల్ కళాశాలలు, 16 ఐఐఎం, 87 నవోదయ పాఠశాలలు, 12 ఐసీఆర్, త్రిపుల్ ఐటీలు మంజూరు చేసినా.. రాష్ర్టానికి ఇచ్చింది గుండుసున్నా అని తెలిపారు. విద్యాసంస్థలు ఇవ్వరు.. నిధులు ఇవ్వరు.. తెలంగాణకు కేంద్రం ఏ రకంగానూ సహకరించరని మండిపడ్డారు. ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం పంచాయితీలు పెట్టి, చిల్లర మల్లర మాటలు మాట్లాడుతారని విమర్శించారు.
15 లక్షల ఉద్యోగాల సంగతేంది?
కేంద్రంలో 15 లక్షల ఖాళీలున్నాయని, బీజేపీకి వాటిని నింపడం చాతకాదుగానీ పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్డుపైకి గుంజి లేనిపోని పంచాయితీలు పెట్టి ఘర్షణ సృష్టించడం తెలుసని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని, ప్రభుత్వరంగంలో ఖాళీలు నింపుతున్నారన్నారు. జోనల్ వ్యవస్థ ద్వారా 95% స్థానిక రిజర్వేషన్లు తెచ్చుకొన్నట్లు తెలిపారు. మిలియన్ మార్చ్ చేద్దామని పిలుపునిచ్చే బీజేపీ నేతలు ముందుగా కేంద్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కలలో కూడా ఊహించని సంక్షేమం
కలలో కూడా ఆలోచనలకు రాని సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని కేటీఆర్ అన్నారు. మన ఊరు మన బడి పేరిట రూ.7,289 కోట్లతో 26వేల సర్కారు బడులను ఆధునీకరించనున్నామన్నారు. హైదరాబాద్‌లో వైద్యసేవలను విస్తృతం చేసేందుకు గచ్చిబౌలిలో టిమ్స్ ఏర్పాటు కాగా.. గడ్డి అన్నారం, గచ్చిబౌలి, అల్వాల్, సనత్‌నగర్‌లో సూపర్‌స్పెషాలిటీ దవాఖాలను నిర్మిస్తున్నట్లు గుర్తుచేశారు. కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, కావ్య, తదితరులు పాల్గొన్నారు.