హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : అర్హుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. పూర్తి వివరాలు అందుబాటులో లేక రాష్ట్రంలో లక్షలాది మందిని నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని చెప్పారు. అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు వారికి మార్గనిర్దేశం చేయాని సూచించారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో బుధవారం పార్టీ ‘సర్’ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీఎల్ రమణ ఆధ్వర్యంలోని ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘సర్’ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించింది. ఈ సందర్భంగా కమిటీకి ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పిం చే చివరి తేదీ ఆగస్టు 3వరకు శ్రేణులు ఇందు లో నిమగ్నం కావాలని కోరారు.
ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత అసలు పని ప్రారంభమవుతుందన్న కేటీఆర్.. జాబితాలో పేర్లు ఉన్నవారు, లేనివారిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అర్హులైన వారి పేర్ల నమోదు కోసం క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ‘సర్’ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లాలను అభినందించిన కేటీఆర్.. దీనిని ఒక యజ్ఞంలా భావించి పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సభ్యత్వ నమోదు ఇన్చార్జులు, జనరల్ సెక్రటరీలు, కో-ఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల రోజున ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటినుంచే ప్రతి అర్హుడైన ఓటరునూ గుర్తించి నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో కమిటీ సభ్యుడు, ఎ మ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గాదరి కిశోర్, ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ‘సర్’ కమిటీ సభ్యులు ముజీబుద్దీన్, రంగినేని అభిలాష్, సు మిత్రా ఆనంద్, వై సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అనేకమంది అధికార పార్టీ నాయకులు గులాబీ గూటికి చేరుతుండడంతో ఇక్కడ హస్తం పార్టీ కుదేలవుతున్నది. తాజాగా బుధవారం ఆ పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో కారు పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఖానాపూర్(కోకాపేట డివిజన్, నర్సింగ్) గ్రామానికి చెందిన పెద్దపులి కిషన్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో బుధవారం కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పటిష్టానికి శక్తివంచనలేకుండా పనిచేయాలని ఉద్బోధించారు. కొత్త, పాత అనే తేడాలేకుండా కలిసికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు.