KTR | పార్టీ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని పలువురు విభిన్న రీతుల్లో వ్యక్తం చేస్తుంటారు. సరిగ్గా అలాంటి అపురూపమైన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ దంపతులు లావణ్య, రాంబాబు. తమ కుమారుడికి పేరు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు తమ బిడ్డను తీసుకువచ్చారు. కేటీఆర్‌ను కలిసిన దంపతులు తమ సంతోషాన్ని పంచుకుంటూ, తమ కొడుకుకు కేటీఆర్ చేతుల మీదుగా పేరు పెట్టడం తమ జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన అని తెలిపారు. ఈ అపూర్వమైన క్షణం తమకు అత్యంత గౌరవనీయమని తెలిపారు.
దంపతుల విజ్ఞప్తికి భావోద్వేగానికి గురైన కేటీఆర్, ఆ చిన్నారి యోగక్షేమాల గురించి ప్రేమగా మాట్లాడారు. బాబుకు ఏ అక్షరంతో పేరు పెట్టాలని కేటీఆర్ వారిని అడిగారు. అందుకు ఆ దంపతులు ‘సు’ అనే అక్షరంతో పేరు పెట్టాలని బ్రాహ్మణులు సూచించిన విషయాన్ని కేటీఆర్‌కు తెలియజేశారు. దీంతో తన కొడుకు హిమాన్షు పేరును గుర్తు చేసుకుంటూ, ‘సు’ అక్షరంతో ‘సూర్యాంశ్’ అనే పేరును ఆ చిన్నారికి కేటీఆర్ పెట్టారు.
కేటీఆర్ కొడుకు హిమాన్షు పేరు మాదిరిగానే తమ కుమారుడికి సూర్యాంశ్ అని పేరు పెట్టడం అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని లావణ్య-రాంబాబు దంపతులు తెలిపారు. ఈ అపురూపమైన ఘడియలు తమ జీవితాంతం గుర్తుండిపోతాయని వారు భావోద్వేగంతో చెప్పారు. “ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మాకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం నుంచి జడ్పీటీసీగా అవకాశం కల్పించి సమాజంలో గొప్ప గౌరవాన్ని ఇచ్చింది కేటీఆర్ గారే. అందుకే ఆయనపై మాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. మా కుటుంబ పెద్దగా భావించి, ఆయన చేతుల మీదుగా మా కొడుకుకు నామకరణం చేయించుకున్నాం” అని వారు వివరించారు.
కేటీఆర్ ఇచ్చిన నేటి దీవెనలు మా కొడుకును ఆయనలాగే గొప్ప వ్యక్తిని చేస్తాయన్న నమ్మకం మాకు ఉంది” అని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం, ఆ తర్వాత వారు తమ సొంత గ్రామానికి తిరిగి బయలుదేరి వెళ్లారు. తమ అభిమాన నేతతో గడిపిన ఈ క్షణాలను వారు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. వారికి కేటీఆర్ ప్రేమతో బహుమతిగా కేసీఆర్ కిట్‌ను అందించారు.