పెన్‌పహాడ్, సెప్టెంబర్ 15 : నారాయణగుడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలో గల పీఏసీసీఎస్ వద్ద ఆదివారం అర్ధరాత్రి నుండి తెల్లవార్లు రైతులు ఒక్క యూరియా బస్తా కోసం జాగారం చేశారు. క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్‌లు.. చెప్పులు వరుసగా పెట్టి కంటికి కునుకు కరువై సహకార సంఘం వద్ద జాగారం చేశారు. పెన్‌పహాడ్ మండల వ్యాప్తంగా నిత్యం రైతులు యూరియా గోస పడుతున్నారు. రైతుకు ఒక్క బస్తా చొప్పున అందిస్తుండడంతో చేసేది లేక కుటుంబ సభ్యులంతా తరలివస్తున్నారు. సోమవారం ఉదయం యూరియా బస్తాల లారీ వస్తాదనే ఆశతో తెల్లవార్లు జాగారం చేస్తే లారీ రాకపోవడంతో సాయంత్రం వరకు నిరీక్షించి రైతులు నిరాశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్‌రెడ్డిని శాపనార్థాలు పెడుతూ ఇంటి బాటపట్టారు.
Penpahad : అనంతారం సహకార సంఘం వద్ద రైతుల జాగారం
పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని చిదెళ్ల సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి క్యూలైన్ లో ఉండి సాయంత్రం వరకు నిలబడి నిరసించి ఆగ్రహంతో రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకుని రైతులతో ధర్నా విరమింపజేశారు. మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ మాట్లాడుతూ.. యూరియా బస్తాలు ఎప్పడు వస్తాయో తెలియదని, రైతులు సమాచారం లేకుండా ముందుగా వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు.
Penpahad : అనంతారం సహకార సంఘం వద్ద రైతుల జాగారం