కేంద్రం అనుమతులు ఇచ్చిన తర్వాత మన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతున్నది. అదే అంశాన్ని కేంద్రం ఆధీనంలోని జీఆర్ఎంబీ అజెండాలో పెట్టడం ఎంతవరకు సమంజసం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మగౌరవం, పౌరుషం ఉంటే 18 నాటి సమావేశాన్ని బహిషరించాలి. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జలసౌధను ముట్టడిస్తాం.
– కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి సాధించిన నీటి ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు జరిగే కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఏడు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడు తుంటే, ఆ అంశాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ) మీటింగ్ అజెండాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ నెల 18న నిర్వహించే సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిషరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే జలసౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, చనాక-కొరటా వంటి ప్రాజెక్టులతోపాటు మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు తెలంగాణ ఎప్పుడూ అడ్డుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల వైఖరి చూస్తుంటే ‘8+8= 0’ అని తాము ఊరికే అనలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఒకరు కూడా గట్టిగా మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కెన్-బెత్వా, పోలవరం, అప్పర్‌భద్ర వంటి ప్రాజెక్టులకు జాతీ య హోదా కల్పిస్తుండగా, తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వబోమని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పినా ఒక్క ఎంపీ కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పాలమూరుకు జాతీయ హోదా ఇస్తామని బీజేపీ నేతలు గతంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు కేంద్రాన్ని నిలదీసే ధైర్యం కూడా తెలంగాణ ఎంపీలకు లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందన్న కేటీఆర్.. ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ హకుల కోసం పోరాడే వారినే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పంప్‌హౌస్‌లను ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వకుండా ప్రభుత్వం యాగాల పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘వరుణ యాగాలు చేయడంలో తప్పులేదు. కానీ యాగంతోపాటు చేయాల్సిన పని కూడా చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవ్వాలి’ అని సూచించారు.