హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ‘పంటల కొనుగోలుపై ఎన్నాళ్లీ ఈ మొద్దునిద్ర? రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా? కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల రాశులపైనే కుప్పకూలుతున్నా కనికరించరా? కడుపు మండి ధాన్యం తగులబెట్టుకున్న అన్నదాతల తండ్లాట తీర్చరా? పంటలనే నమ్ముకొని రైతులు సంబురపడాల్సిన కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణ మృదంగమేమిటి? చేతగాని, చేవచచ్చిన సర్కార్ వైఫల్యానికి పరాకాష్ట కాదా?’ అని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం కేటీఆర్ లేఖ రాశారు. పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు రెండు నెలలుగా అన్నదాత పడుతున్న కష్టాలను ఆ లేఖలో ఏకరువు పెట్టారు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్డెక్కని రైతులేడని, రాస్తారోకో జరుగని రహదారి లేదని పేర్కొన్నారు. నేడు ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్న రైతులే రేపు కీలెరిగి వాతలు పెడుతారని హెచ్చరించారు. వడ్ల కొనుగోలుకు కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కార్‌కు రైతన్న చేతిలోనే కౌంట్‌డౌన్ మొదలైందని స్పష్టంచేశారు.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో కొం డంత ధైర్యంతో బతికిన అన్నదాత.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని సీఎంకు రాసిన లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆరు దశాబ్దాల కష్టాలు శాశ్వతంగా తీరిపోయానని సంబురంగా సాగు చేసుకుంటున్న రైతన్నల నోట్లో కాంగ్రెస్ మట్టికొట్టిందని దుయ్యబట్టారు. రైతుకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన పథకాలకు రేవంత్ సర్కార్ పాతరేసి అన్నదాత వెన్ను విరిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్టకు చేరాయని తూర్పారబట్టారు.
పెట్టుబడి సాయా న్ని నాలుగుసార్లు ఎగ్గొట్టినా, యూరియా కష్టాల పాల్జేసినా వాటిని అధిగమించి పంటలు పండిస్తే కొనుగోలు చేసే నాథుడే లేడని ధ్వజమెత్తారు. ‘మీరు చేసిన ద్రోహంతోపాటు వడదెబ్బ బారిన పడి 10 మందికి పైగా రైతులు ప్రాణాలు విడిచారు. 30 నెలల్లో సమైక్య పాలనలోని పరిస్థితులను తెచ్చి రైతులను నిండాముంచారు. ఇన్నాళ్లు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చారు. రైతుల కన్నీళ్లతో ఖాళీగా ఉన్న రిజర్వాయర్లు నిండేలా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ‘చివరికి మీ సొంత నియోజకవర్గమైన కొడంగల్ రైతులు సైతం రోడ్డెక్కి దుమ్మెత్తిపోసే దుస్థితి వచ్చిందంటే సంక్షోభంలో చిక్కుకున్న సాగు పరిస్థితికి అద్దంపడుతుంది’ అని స్పష్టంచేశారు.
వరంగల్ నుంచి ఖమ్మందాకా కొనుగోలు కేంద్రాల్లో ఒక్క లారీ లోడ్ కూడా ఎత్తడం లేదని కేటీఆర్ పేర్కొన్నా రు. ‘కొనుగోలు చేసిన పంటలోనూ క్వింటాకు 10 కిలోలకు పైగా తరుగు పెడితే రైతుకు మిగిలేదేంటో చెప్పాలి.. గన్నీ బ్యాగుకు రూ.50 డిపాజిట్ చేయాల్సి రావడం సిగ్గుచేటని తె లిపారు. ‘బోనస్ ఇచ్చే ముఖం మీ సర్కార్‌కు ఎలాగూ లేదు.. కనీసం వడ్లను సైతం కొనుడు చేతగాకుంటే ముక్కునేలకు రాసి 60లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పా లి’ అని డిమాండ్ చేశారు. రైతులు గోసప డుతుంటే పర్యాటక వారోత్సవాలు జరుపుకోవడం బాధాకరమని మండిపడ్డారు. రేవంత్ చేసిన సాగుద్రోహానికి ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా రైతులు బలైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రాల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.