సిటీ బ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ ) : హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ రంగాన్ని విధ్వంసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్ నుంచి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ పేరుతో పేద ఇండ్లను కూల్చి వాళ్లను అవస్థల పాలు చేశారని మండిపడ్డారు. హైడ్రాను తనకోసమే తీసుకొచ్చినట్లుగా జన్వాడలో తనకున్న భూమిపైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్ను పడిందన్నారు. తన ఇంటిని కూల్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేశారని ఆరోపించారు. రూ.లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్టుతో ఢిల్లీకి డబ్బుల సంచులు పంపి తన కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణతో ఎవరికి లాభం కలుగతుందని ప్రశ్నించారు. దాని వల్ల ఎంత మంది రైతులు బాగుపడతారు? దానితో సృష్టించే సంపద ఎంత? మూసీతో పారే ఎకరాలెన్ని? దాని వల్ల ఎవరికి లాభం కలగుతుందని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వంలో శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఉపాధి పొందారన్నారు. శంకరపల్లి పరిధిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రియల్ భూముల ధరలు గణనీయంగా పడిపోయాయన్నారు. దీంతో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, పటోల్ల కార్తిక్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది శాసన సభలో అడుగుపెట్టబోతున్నారని జోష్యం చెప్పారు. చేవెళ్ల చెల్లెమ్మగా పేరొందిన సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. చేవెళ్ల జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, దాన్ని విస్తరించాలని కేసీఆర్ ఎన్నిసార్లు ప్రతిపాదించినా.. కేంద్రం స్పందించలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల, శంకరపల్లికి నీళ్లు తీసుకురావడానికి ఆనాడు కేసీఆర్ కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులేసి ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తి చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి 10 శాతం పనిచేసి నీళ్లివ్వమంటే మూసీని సుందరంగా చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రేవంత్‌తో పాటు మంత్రులకు రాష్ట్రంతోపాటు ప్రజలపై ఏ మాత్రం బాధ్యత లేదు..గాలికి మాట్లాడుతున్నా రు. వారు ఏమి మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. ఏడాదిన్నర దాటినా ఒక్క పథకమూ సక్రమంగా అమలు కావడంలేదు.. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని.. రేషన్‌కార్డులు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటికీ ఇచ్చింది ఒక్కటి లేదు. ఏమన్నంటే ఫ్రీ బస్సు అమలు చేస్తున్నామని చెబుతున్నారు. మనం బస్సు ఇప్పుడే ఎక్కుతున్నట్లు, ఎప్పుడూ ఎర్ర బస్సు మొఖం చూడనట్లు మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణలో ప్రజలకు కష్టమొచ్చినా.. సంతోషమొచ్చినా కేసీఆర్‌నే గుర్తుకు చేసుకుంటున్నారు. పదేం డ్ల కేసీఆర్ పాలనలో మేమంతా సం తోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. పెద్దాయన(కేసీఆర్)ఉంటే తమ కు కష్టాలు వచ్చేవి కాదని పేర్కొంటున్నా రు. ఏ గ్రామానికెళ్లి ఎవరినీ అడిగినా ఒక్క టే అంటున్నారు.. ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడు పోతుందని.. ఎన్నికలు ఎవైనా గెలుపు మాత్రం బీఆర్ఎస్దే కావాలి. అందుకు సిద్ధంగా ఉండాలి.