హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ‘నా లాంటి యువతకు మీరే స్ఫూర్తి’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి సయీదా ఫాతిమా పేర్కొన్నారు. అమెరికాలో రాజనీతి శాస్త్రం చదివేందుకు వెళ్లే ముందు ఆమె సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత ప్రజాసేవ కోసం కేటీఆర్‌తో కలిసి పనిచేస్తానని తన మనసులో మాటను చెప్పారు. ఎనిమిదేండ్ల తర్వాత తనను కలిసిన ఫాతిమా అభిమానానికి కేటీఆర్ ఫిదా అయ్యారు. బాగా చదువుకొని స్వదేశానికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఫాతిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
తన వ్యక్తిత్వం, పనితీరుతో తెలంగాణతో పాటు దేశంలోని ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలిచిన కేటీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లో వస్తానని హైదరాబాద్‌కు సయీదా ఫాతిమా తెలిపింది. 2017లో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌లో నాడు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను తండ్రితో కలిసి పదేండ్ల పాపగా ఉన్న సయీదా ఫాతిమా కలిసింది. అప్పటికే సోషల్ మీడియా, మీడియాలో రెగ్యులర్‌గా కేటీఆర్‌ను ఫాలో అవుతున్న ఫాతిమా, తెలంగాణ రాష్ట్రం ఇకడి ప్రజలు, యువత కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయనకు అభిమానిగా మారింది. భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉన్న కేటీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని నమ్మి రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పంతో ఉన్నది. బీఆర్ఎస్లో చేరి కేటీఆర్ మార్గదర్శనంలో ప్రజాసేవ చేయాలనుకుంటున్నది. ఎనిమిదేండ్ల క్రితం తాను కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిన తీరును వివరించింది.
రేపటి ప్రపంచానికి ప్రతినిధులైన ఫాతిమా లాంటి యువశక్తికి తాను ప్రేరణగా నిలవడం సంతోషంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. మారుతున్న నేటి యువత ఆలోచనలకు ఫాతిమా ప్రతిరూపమని కొనియాడారు. తెలంగాణలోని అన్నివర్గాల యువత బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని, తెలంగాణ బాగు కోసం కలిసి పనిచేస్తామని ముందుకు వస్తున్నదని చెప్పారు. దేశానికి, తెలంగాణకు ఫాతిమా లాంటి యువత అవసరం ఎంతో ఉన్నదని చెప్పారు.