జనగామ, మే 5(నమస్తే తెలంగాణ)/నర్సంపేట/గీసుగొండ : రాష్ట్రంలో రాబందు పాలన పోయి రైతుబంధువు కేసీఆర్ పాలన వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయకపోయినా అష్టకష్టాలు పడి రైతులు పంటలు పండించినా.. కొనలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులోగా ప్రభుత్వం అన్ని పంటలు కొనుగోలు చేయకపోతే రాష్ర్టాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని పరకాల, నర్సంపేట, ఊకల్, యశ్వంతాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శాసనమండలిలో పక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతీరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ రాజయ్య, పార్టీ నేతలు రాకేశ్‌రెడ్డి, సదానందం తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసేదాకా రైతులకు అండగా ఉంటామని అభయం ఇచ్చారు.
రాబందు పాలన పోవాలె.. మళ్లీ ‘రైతుబంధువు’ కేసీఆర్ పాలన రావాలె.. ఇదే తెలంగాణ రైతాంగం నినాదం. కేసీఆర్ హయాంలో పంటలు కొనుగోలు చేసినట్టే ఇప్పుడు రైతులు పండించిన వరి, మక్కజొన్న, శనగలు సహా అన్ని కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ సర్కార్‌కు రేపటి వరకు గడువు ఇస్తున్నాం. వెంటనే అన్ని మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో మక్కల కొనుగోళ్లు ప్రారంభించకుంటే రైతులతో కలిసి ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ర్టాన్ని దిగ్బంధిస్తాం.
– కేటీఆర్
నాలుగేండ్ల క్రితం ఇదే వరంగల్ గడ్డపై రాహుల్‌గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతులకు మద్దతు ధర, బోనస్, రైతు భరోసా అంటూ 34 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు. బోనస్ బోగస్ అయ్యింది.. రైతుబంధు లేదు.. ఆరుగాలం పడించిన పంట నెలరోజులైనా కొనే నాథుడు లేడు.. కొన్నా జోకెటోడు లేడు. బస్తాలు ఎత్తెటోడు లేడు.. దించుకునేటోడు లేడు.
– కేటీఆర్
‘రేవంత్‌రెడ్డికి ఎంతసేపూ ఢిల్లీకి మూటలెట్ల పంపాలె… భూములెట్ల అమ్మాలె.. కుర్చీనెట్ల కాపాడుకోవాలె’ అనేదానిపైనే రేవంత్ ధ్యాస అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో భారీ కుంభకోణానికి పాల్పడటం వల్లే ఆ కార్పొరేషన్‌కు అప్పు పుట్టని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. సివిల్ సప్లయీస్‌లో భారీ కుంభకోణాన్ని వెలికితీసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేంద్రం స్పందించలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే తక్షణమే కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 6వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, ఫలితంగా సదరు కార్పొరేషన్‌కు అ ప్పు పుట్టని పరిస్థితి దాపురించిందని వివరించారు. అందుకే మార్క్‌ఫెడ్ పేరుమీద రూ.22,700 కోట్ల అప్పు తీసుకొని ఆ మొత్తాన్ని మక్కల కొనుగోళ్లకు వినియోగించకపోవటం వల్లే రాష్ట్రంలో రైతులు ఇ బ్బందులు పడుతున్నారని తెలిపారు.
జనగామ నియోజకవర్గంలో వారం రోజుల నుంచి కొనుగోళ్లు జరగడం లేదు. వేలాది క్వింటాళ్ల పంట రాశులు పోసుకొని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క గింజ కొనలేదు.. కాంటా వేయలేదు.. అసలు మార్క్‌ఫెడ్ కొంటదా? కొనదా?.. రాష్ట్రవ్యాప్తంగా మక్కల పరిస్థితి ఇలాగే ఉన్నదా? వర్షాలు పడితే రైతులు నష్టపోతరు.. ముందుగా మక్కలు కొనుగోలు చేసి గోదాముల్లో పెట్టుకోండి.. పైసలు తర్వాత ఇవ్వచ్చు.
– కేటీఆర్
రైతుబంధు వచ్చిందా? రుణమాఫీ అయ్యిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండె.. ఇప్పుడెట్లున్నది? అని కేటీఆర్ రైతులను ప్రశ్నించారు. వరంగల్‌కు వెళ్తూ జనగామ జిల్లా యశ్వంతాపూర్‌లోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపేంద్రమ్మ, విజయలక్ష్మి, నాగమణితో పాటు పలువురు రైతులతో ము చ్చటించారు. ఎంత భూమి ఉంది? ఎన్ని ఎకరాల్లో మక్కజొన్న వేశారు? దిగుబడి ఎంత వచ్చింది? సెంటర్‌కు పంట తెచ్చి ఎన్ని రోజులైంది? వర్షం వస్తే పరిస్థితి ఏమిటి? రైతుబంధు వచ్చిందా? రుణమాఫీ అయ్యిందా? కేసీఆర్ సర్కార్ హయాంలో ఎట్లుం డె.. ఇప్పుడెట్లున్నది? అప్పటికీ ఇప్పటికీ తేడా ఉం దా? లేదా? అంటూ కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
సమీపంలోని నిడిగొండ గోదాము హమాలీ కార్మికులు, లారీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లతో మాట్లాడి వారి స మస్యలు అడిగారు. అక్కడినుంచే మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మా ట్లాడి రైతులు కష్టాలను వివరించారు. 14లక్షల ఎకరాల్లో రైతులు కష్టపడి 45లక్షల టన్నుల మక్కలు పండిస్తే ఇప్పటివరకు 6లక్షల క్వింటాళ్లే కొనుగోలు చేశామని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కేవలం 10 నుంచి 15లక్షల టన్నులు కొని చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదని, రైతుల దగ్గర కొంటే క్వింటాల్‌కు కనీస మద్దతు రూ.2,460 ఇవ్వాల్సి వస్తుందనే సాకుతో నామమాత్ర కొనుగోళ్లతో కాలం గడిపేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. తాను చెప్పింది తప్పైతే.. వ్యవసాయశాఖ మంత్రి గానీ, అధికారులు ముందుకొచ్చి నిరూపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతులు పండించిన ప్రతి గింజ కూడా కొన్నామని, ఆఖరికి తడిసిన ధాన్యం, మక్క లు కూడా కొనుగోలు చేశామని కేటీఆర్ గుర్తుచేశారు.

జనగామ మండలం యశ్వంతాపూర్ మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం వద్ద మక్కజొన్న రైతులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే పల్లా తదితరులు

వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో నాయకులు
మధుసూదనాచారి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, చల్లా ధర్మారెడ్డి తదితరులు

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్‌లోని కొనుగోలు కేంద్రంలో మహిళా రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్

వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులను ఆప్యాయంగా పలుకరిస్తున్న కేటీఆర్