సిటీబ్యూరో, మే 5(నమస్తే తెలంగాణ) : కాలుష్య కోరల నుంచి నగరాన్ని కాపాడుతున్న కేబీఆర్ జాతీయ పార్కుపై అభివృద్ధి పేరిట విధ్వంసానికి తెరలేపింది. అడ్డగోలు ఫ్లైఓవర్లను కట్టేందుకు తీసుకువచ్చిన వివాదస్పద హెచ్-సిటీ ప్రాజెక్టులతో పార్కు అస్తిత్వాన్నే దెబ్బతీయనుంది. ఈ క్రమంలో అడ్డువస్తున్న పర్యావరణ నిబంధనలపై బుల్డోజర్లను ఎక్కిస్తున్న సర్కారు… ఏకంగా ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జడ్)ను కూడా కనుమరుగు చేసేలా ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. హైదరాబాద్ నగరానికి దాదాపు వందల ఎకరాల విస్తీర్ణంలో, నిజాం వారసత్వానికి చెందిన ఈ చిట్టడవి.. పర్యావరణ కేంద్రంగా మారింది. నిజాం కాలంలో ఈ ప్రాంతాన్ని ఒక విడిది కేంద్రంగా వినియోగించగా, కాలక్రమంలో జాతీయ పార్కుగా మారింది.
అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు పర్యావరణం పరంగా ఎంతో సున్నితమైన ఈ ప్రాంత పరిసరాల్లో భవన నిర్మాణ అనుమతుల విషయంలో వివాదాలే కొనసాగుతున్నాయి. కానీ ఎక్కడా జాతీయ పార్క్ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేలా గత ప్రభుత్వాలేవి ప్రయత్నించలేదు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… అత్యాశతో పర్యావరణ అంశాలపై ఏమాత్రం అవగాహన లేనట్లుగా విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. కనీసం ఇదొక ఎకో సెన్సిటివ్ జోన్ అనే విషయాన్ని మరిచి నగరాభివృద్ధి పేరిట నిర్వీర్యం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
ఎన్జీటీ నిబంధనలు గాలికి…
జాతీయ పార్కుల చుట్టూ కనీసం ఒక కిలోమీటర్ మేర ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ కేబీఆర్ పార్కు విషయంలో మాత్రం సర్కారు బుల్డోజర్ వైఖరి అవలంభిస్తోంది. కిలోమీటర్ ఉండాల్సిన జోన్‌ను కేవలం 3-29 మీటర్లకే పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ తీసుకురావడం వెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్- సిటీ ముసుగులో విధ్వంసం చేసేందుకు, ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసేందుకు తీసుకువస్తున్న ఈ ప్రాజెక్టుతో పార్కు పరిసరాల్లో ఉన్న వేల చెట్లు నేలమట్టం కానున్నాయి. చివరకు ప్రజాధనం వృథా అవుతుందని, పనులు ఆలస్యం అవుతుందనే సాకులతో.. పర్యావరణ అనుమతులను కూడా కాలరాస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి గనుక ఉంటే ఎలాంటి నిర్మాణ పనులకు ఆస్కారం లేని ప్రత్యామ్నాయాలను అన్వేషించవచ్చు. కానీ కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం 1090 కోట్ల రూపాయలతో భారీ ఫ్లైఓవర్లు కట్టేందుకు సర్కారు సిద్ధం అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
వివాదాలు అనేకం..
ఎకో సెన్సిటివ్ జోన్ అంశంలో ఎన్నో వివాదాలున్నాయి. ముఖ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చిన గోదావర్మన్ తిరుమల్పాడ్ కేసు తీర్పును కూడా పక్కనపెట్టింది.. సిటీ మధ్యలో కిలోమీటర్ జోన్ జాతీయ పార్కు చుట్టూ సాధ్యం కాదని వాదిస్తోంది. అయితే పరిధి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. పార్కు చుట్టూ విస్తరించి ఉన్న వైవిధ్యమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన సర్కారు.. కాంక్రీట్ నిర్మాణాలతో తూట్లు పొడుస్తుంది. అభివృద్ధి పేరిట వృక్ష సంపదను నిర్వీర్యం చేసి, భావి తరాలకు స్వచ్చమైన గాలి లేకుండా నాశనం చేయాలని చూస్తోంది. చట్టబద్ధంగా ఉండాల్సిన ఈఎస్జడ్ను కుదించడం ద్వారా ప్రభు త్వం జీవవైవిధ్యాన్ని బలిపీఠం ఎక్కిస్తోంది. నగరానికి ఆక్సిజన్ అందించే ఈ అడవిని కాపాడుకోకపోతే, రేపు కాంక్రీట్ ఎడారిగా మారడం ఖాయమన్నారు. హెచ్-సిటీ ప్రాజెక్టు వల కలిగే తాత్కాలిక సౌకర్యం కంటే, పర్యావరణానికి జరిగే శాశ్వత నష్టం కోలుకోలేనిది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి, పర్యావరణవేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలననారు. కేబీఆర్ పార్క్ పరిరక్షణే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు.
నోరు మెదపని పర్యావరణ, సామాజిక కార్యకర్తలు
వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను నిర్వీర్యం చేస్తుంటే, గతంలో కేబీఆర్ పార్కు అభివృద్ధి కోసం పోరాడిన పర్యావరణవేత్తలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. పర్యావరణానికి జరిగే శాశ్వత నష్టం కలిగిస్తున్న కాంగ్రెస్ సర్కారు చర్యలను చూస్తు ఊరుకుంటున్నారే తప్పా… ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహారిస్తోంది.