హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గ పరిధికి చెందిన నిరుద్యోగి వేణు కుమార్ రాసిన సూసైడ్ నోటు.. కాంగ్రెస్ చేతగాని, అసమర్థ పాలనపై వేసిన చార్జ్‌షీట్ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. నిరుద్యోగి రాసిన సూసైడ్ నోటుకు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాహుల్‌గాంధీ ఎకడ పోయారని నిలదీశారు. ఇతర రాష్ర్టాల్లో చిన్న ఘటన జరిగినా, లాఠీచార్జ్ జరిగినా పరుగెత్తుకెళ్లే రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన తెలుపుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ప్రధాని ఇంటి ఎదుట ధర్నా చేసినట్టు బిల్డప్ ఇచ్చిన రాహుల్.. మరి తెలంగాణలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఎందుకు ఇక్కడికి రావడం లేదని నిలదీశారు. అశోక్‌నగర్‌కు వచ్చి విద్యార్థులతో మాట్లాడే దమ్ము రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర నిరుద్యోగ యువతను ఎన్నికల హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా మోసం చేశాయని నిప్పులు చెరిగారు.
రాష్ట్ర ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన చేతిలో లేని అంశాలపై మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 21 ఏండ్ల్లకే చట్టసభల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, తెలంగాణ యువతకు యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్-జీకి చెందిన యువకుడిని విద్యాశాఖ మంత్రిగా నియమిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేస్తూ, ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను యువకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు.
21 ఏండ్ల్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసినా అది ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు. ‘విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి సాధించిన విజయం అంటే 150 మంది గురుకుల విద్యార్థుల మరణాలా? ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులకు ‘ఎండ్రిన్ తాగి చావండి’ అనే పరిస్థితి కల్పించడమా? రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 వేల కొత్త ఉద్యోగాలకే పరిమితం కావడమా? ఏ విషయంలో ఆయన విజయవంతమయ్యారో ప్రజలకు చెప్పాలి’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపడంతోపాటు 1.65 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 10 వేల కొత్త ఉద్యోగాలే ఇచ్చిందని, దీంతో రాష్ట్ర యువత తీవ్ర నిరాశా నిస్పృహలకు గురవుతున్నదని వాపోయారు.
యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ చేసిన మోసం కారణంగానే యువతలో తీవ్ర ఆగ్రహం, నిరాశ పెరుగుతున్నదని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, యువత ఓట్లు అడిగిన రాహుల్‌గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ర్టాల్లో నీతులు చెప్పే రాహుల్‌గాంధీ, తన పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థులపై జరుగుతున్న అన్యాయం, మోసం, అణచివేత, అక్రమ కేసులు, అరెస్టులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ తాము ఇప్పటికే రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశామని, తెలంగాణ యువతకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసాన్ని తట్టుకోలేక ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.
ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే తన జీవితంలో ఈ దుస్థితి వచ్చిందని వేణు తన లేఖలో స్పష్టంగా పేరొన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ యువతకు చేసిన వాగ్దానాలు, వాటి అమల్లో జరిగిన మోసాన్ని కూడా వేణు తన లేఖలో ప్రస్తావించారని తెలిపారు. సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దాఖలైన ఒక చార్జ్‌షీట్ అని పేరొన్నారు. ఒకవేళ ఆ లేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందకపోతే బీఆర్ఎస్ తరఫున తామే పంపిస్తామని చెప్పారు.
అందులోని అంశాలు చదివిన తర్వాతైనా యువతపై కనీసం జాలి, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. తన ప్రాంత నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే భట్టి ఎందుకు స్పందించడం లేదనని నిలదీశారు. యువకుడు రాసిన సూసైడ్ నోట్‌ను మీడియాకు చదివి వినిపించారు. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దని, డిప్రెషన్లోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరూ ఆత్మహత్యలు లేదా బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు వారి భవిష్యత్తుకు అండగా నిలిచే విధానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
జూలై నెల అంతా గోదావరిలో నీళ్లు నిండుగా పారుతున్నా, కాంగ్రెస్ సర్కార్ పంపింగ్ చేయకుండా నీళ్లను సముద్రంలోకి వదిలేసి వ్యవసాయాన్ని ఎండబెట్టింది. నీళ్లెత్తకుండా రైతులను ముంచిన క్రిమినల్ వేస్ట్ ప్రభుత్వమిది! క్రిమినల్ గవర్నమెంట్ ఇది. కేవలం 4 టీఎంసీల నీళ్లు రాంగనే హెలికాప్టర్ వేసుకొని పోయి పోజులు కొట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై, గాయత్రి, నందిమేడారం పంప్‌హౌస్‌లపై కనీస అవగాహన ఉన్నదా?
-కేటీఆర్
రేవంత్‌రెడ్డి తీసుకొచ్చే ప్రతి పథకం వెనుక ఒక దోపిడీ కుట్ర దాగి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ మెట్రోను టేకోవర్ చేయడం వెనుక సీఎం రేవంత్, ఆయన సోదరులు రూ.200 కోట్లు కొట్టేసేందుకు పెద్ద సెచ్ వేశారని విమర్శించారు. మెట్రోకు చెందిన 270 ఎకరాల భూములు తన అనుయాయులకు అప్పనంగా అప్పగించాలని చూస్తున్నారని చెప్పారు. గతంలో మెట్రో విస్తరణకు కాంగ్రెస్, బీజేపీ అడ్డంకులు సృష్టించాయని, లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు ట్రాఫిక్ ఉండదని అబద్ధం చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు మెట్రో విషయంలో మళ్లీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రైవేట్ కంపెనీ అప్పులను రాష్ట్ర ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకెళ్తే, వాటిని రద్దు చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డేనని విమర్శించారు. అప్పట్లో మెట్రో విస్తరణకు అభ్యంతరం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నదో, మెట్రోను టేకోవర్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అనేక చిన్న పట్టణాలకు మెట్రోలను మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మెట్రో విస్తరణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా అన్యాయమేనని విమర్శించారు.
అశోక్‌నగర్‌కు వచ్చి విద్యార్థులతో మాట్లాడే దమ్ము రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి ఉన్నదా? చెత్త (బహిరంగ) సభలనే కాదు.. చట్ట సభలను సైతం కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జాబ్ క్యాలెండర్ కాదు. అది పకాగా జాబ్ లెస్ క్యాలెండర్.
-కేటీఆర్
నిజమైన క్రిమినల్ వేస్ట్ ఏందంటే.. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి కలిసి ప్రకటించిన బోగస్ డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్. వందల టీఎంసీల గోదావరి నీళ్లను సముద్రంలోకి వృథాగా వదలడం క్రిమినల్ వేస్ట్. ప్రజల సొమ్ము రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టడం, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ.100 కోట్లు తగలేయడం క్రిమినల్ వేస్ట్. తెలంగాణకు రేవంత్‌రెడ్డిని సీఎంగా పెట్టడమే పెద్ద క్రిమినల్ వేస్ట్.
-కేటీఆర్
తెలంగాణ ఇంజినీర్లను ‘క్రిమినల్ వేస్ట్’ అని సీఎం రేవంత్‌రెడ్డి సంబోధించడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్‌రెడ్డి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఇంజినీర్లను అవమానించడం అత్యంత దురదృష్టకరమని వాపోయారు. అది రేవంత్‌రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలా లేక కాంగ్రెస్ పార్టీ విధానమా? అనేది రాహుల్ స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. రాహుల్, రేవంత్‌కు విద్యార్థుల ముందుకొచ్చి మాట్లాడే దమ్ములేదని విమర్శించారు. రేవంత్‌ను సీఎంగా పెట్టడమే పెద్ద క్రిమినల్ వేస్ట్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక్క పోటీపరీక్ష అయినా రాశావా?
రేవంత్‌రెడ్డి నకల్ కొట్టి పాసైన బాపతే అయ్యుంటుందని కేటీఆర్ దెప్పిపొడిచారు. ‘రేవంత్.. నీ ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతవా? నీ జీవితంలో ఒక పోటీ పరీక్షయినా రాసినవా? ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనవా?’ అని ప్రశ్నించారు. ‘మేం కష్టపడి చదివినం.. గొప్పగొప్ప యూనివర్సిటీల్లో చదివినం’ అని చెప్పారు. ‘ఇంజినీర్లకు నిర్మాణాలు కట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసు’ అని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, ఎల్లంపల్లి రివర్స్ పంపింగ్, నేడు సీఎం కూర్చుంటున్న సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించింది తెలంగాణ ఇంజినీర్లేనని గుర్తుచేశారు. విదేశాల్లో భారతీయ, తెలంగాణ ఇంజినీర్లు అగ్రగామి కంపెనీల్లో పనిచేస్తుంటే.. రేవంత్‌రెడ్డి వారిని క్రిమినల్ వేస్ట్ అనడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐటీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పటివరకు 7,000 ఐటీ ఉద్యోగాలు పోయాయని కేటీఆర్ గుర్తుచేశారు. పోటీ పరీక్షలకు ఫీజులు ఉండవని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఫీజులు పెంచిమరీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారని, తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రోజుకో అర్థం లేని మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘గురుకులాల్లో 150 మంది విద్యార్థులను చంపడం కాంగ్రెస్ సక్సెసా? ఎండ్రిన్ తాగి చావండని తిట్టడం సక్సెసా?’ అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు పారిశ్రామికవేత్తలను తుపాకులు పెట్టి బెదిరిస్తుంటే పరిశ్రమలు రాష్ర్టానికి ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్ నడుస్తున్నదని మండిపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
జూలై నెల అంతా గోదావరిలో నీళ్లు నిండుగా పారుతున్నా, ప్రభుత్వం ఎత్తిపోయకుండా సముద్రంలోకి వదిలేసి పంటలను ఎండబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. నీళ్లు ఎత్తకుండా రైతులను ముంచిన క్రిమినల్ వేస్ట్, క్రిమినల్ గవర్నమెంట్ ఇదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం 4 టీఎంసీల నీళ్లు రాగానే హెలికాప్టర్ వేసుకొని పోయి పోజులు కొట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై, గాయత్రీ, నందిమేడారం పంప్‌హౌస్‌లపై కనీస అవగాహన ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లెలా వస్తున్నయ్? గాయత్రీ పంప్‌హౌస్, నందిమేడారం పంప్‌హౌస్ నుంచి కాదా? అవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? కాళేశ్వరంపై ఉత్తమ్‌కు అసలు అవగాహన ఉన్నదా?’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం లేదని విమర్శించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా, ఆ ప్రాజెక్టు వల్ల రైతులకు, రాష్ర్టానికి కలిగిన ప్రయోజనాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోరని గుర్తుచేశారు. రాష్ట్రంలో మంచిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని మొకుకున్నానని చెప్పారు.
రేవంత్‌రెడ్డి ఏం చదివిండో నాకైతే డౌటే. ఎలా పాసైండో అందరికీ డౌటే. నకల్ కొట్టి పాసైన బాపతే అయ్యుంటది. మిస్టర్ రేవంత్.. నీ ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతవా? నీ జీవితంలో ఒక పోటీ పరీక్షయినా రాసినవా? ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనవా? గోడలపై సున్నాలేసుకునే నువ్వు.. గొప్ప విశ్వవిద్యాలయాల్లో కష్టపడి చదివిన ఇంజినీర్లను విమర్శిస్తవా?
-కేటీఆర్
రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీ నేతలు అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసులు పెడుతున్నారని చెప్పారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ సర్కార్‌లో జరిగిన సివిల్ సప్లయ్ స్కామ్‌ను బయటపెట్టగానే నర్సంపేటకు చెందిన ఇద్దరు వ్యాపారులపై కేసులు పెట్టారని, పెద్ది పేరు చెప్పాలని వారిపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ఆయనకున్న కొన్ని అనారోగ్య సమస్యలతోపాటు కాంగ్రెస్ పెద్దలు చేసిన అక్రమ వేధింపులు కూడా గుండెపోటుకు కారణమని ఆరోపించారు.
ఉద్యోగాలు, విద్య, వ్యవసాయం, సాగునీరు, ఐటీ రంగం, ప్రజా సంక్షేమం వంటి ప్రతి రంగంలో ప్రభుత్వం అసమర్థతను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజులపాటు పొడిగించి నడుపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన ప్రచార హామీలపై శాసనసభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని గట్టిగా నిలదీస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, బోథ్ ఎమ్మెలే అనిల్‌జాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ నాయకుడు రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఐటీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పటివరకు 7,000 ఐటీ ఉద్యోగాలు పోయినయ్. ఎందుకు ఉద్యోగాలు తగ్గినయో ప్రభుత్వం చెప్పాలి. అధికారంలోకి వస్తే పోటీ పరీక్షలకు ఫీజులు ఉండవని చెప్పిండ్రు. కానీ, ఫీజులు పెంచిమరీ వసూలు చేస్తున్నరు.
-కేటీఆర్

‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ చెప్తే నమ్మి ఓట్లేసినం. కానీ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. పంచవర్ష ప్రణాళిక మాదిరిగా నోటిఫికేషన్స్ ఇస్తే నాలాంటి ఎందరో నిరుద్యోగులు ఎదురుచూపుల్లోనే విలువైన సమయాన్ని, వయసును పోగొట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల చేస్తే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు.
– ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన నోట్లో ఖమ్మం నిరుద్యోగి వేణుకుమార్

7,437 పోస్టులతో కాకుండా 19వేల పోలీస్ ఉద్యోగాలతో ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టింది. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు.

ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’గా పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి లక్ష మంది విద్యార్థులతో నామినేషన్ వేయిస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు తెలంగాణభవన్ వద్ద మీడియా సమక్షంలో ప్లకార్డులను ప్రదర్శించారు.