హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు తెలంగాణపై వివక్ష చూపుతున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రూ. 2లక్షల కోట్ల విలువైన బుల్లెట్ రైళ్లు మంజూరు చేసిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడ్డుచెప్పడం విడ్డూరమని గురువారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. కనీసం తెలంగాణకు మెట్రో ప్రాజెక్టు విస్తరణకైనా నిధులివ్వరా? అని ప్రశ్నించారు. ఇంత అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు.
రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ఓ పత్రిక క్లిప్‌ను ట్యాగ్ చేసి ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. బీజేపీ ఎంపీలు చేసింది సున్నా అని కొందరు పేర్కొన్నారు. ఒడిశాలో 20 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే భువనేశ్వర్ మెట్రోను అటకెక్కించా రని ఆ రాష్ర్టానికి చెందిన వారు పేర్కొన్నారు.