ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది.
నాడు ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం కేసీఆర్‌గారు సీతారామసాగర్ ప్రాజెక్టును నిర్మించతలపెట్టి 90 శాతం పనులను పూర్తిచేశారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, గోదావరి జలాలపై పూర్తి హక్కులు ఖమ్మం జిల్లాకే దక్కాలని నాడు కేసీఆర్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టును పక్కనపెట్టారని మండిపడ్డారు. ఆ ముగ్గురు మంత్రులు ప్రజలకు మేలు చేయగల మొనగాళ్లు కాదని, మోసగాళ్లని కేటీఆర్ విమర్శించారు. వారు 30 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేసి జేబులు నింపుకోవడమే తప్ప జిల్లాకు పనికొచ్చే పనులు ఒక్కటి కూడా చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఈస్ట్‌మన్ కలర్లో సినిమా చూపెట్టారని, ఇదిస్తాం.. అదిస్తాం అని నోటికొచ్చిన హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏదీ ఇవ్వలేదని విమర్శించారు.
అశ్వారావుపేటలో ఒక్క సీతారామసాగర్ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా కేసీఆర్ డిజైన్ చేశారని కేటీఆర్ చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు, ఇల్లందు నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో 10 వేల ఎకరాలకు, వైరాలో 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కేసీఆర్‌గారు సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందంటే.. అది ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలేని, కేటీఆర్ ఎద్దేవా చేశారు.