సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్రయత్నాలను వ్యతిరేకించాలని, హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధుల విన్నపాన్ని విన్న కేటీఆర్.. కేబీఆర్ పార్కు హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన లంగ్స్ స్పేస్ అని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో కేబీఆర్ పార్కు కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు.
ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేబీఆర్ పార్కు ఉనికి, చెట్లకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అండర్‌గ్రౌండ్ ప్రతిపాదికన ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ప్రణాళికలు ఇప్పటికీ మున్సిపల్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం సరైన విధానం కాదని, సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయవచ్చని పేర్కొన్నారు.
కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలంటే కేబీఆర్ పార్కు వంటి పర్యావరణ సంపదలను కాపాడుకోవడం అత్యవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.