
రాజకీయాలు, పదవులు, అధికారం.. ప్రజలు పెట్టిన భిక్ష. వారు ఎవరు కావాలనుకొంటే వారు మంత్రులవుతారు. అధికారమే పరమావధి కాదు. అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది ప్రజలు చూస్తరు. గత ఏడున్నరేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో ఇక్కడి బీజేపీ నేతలు చెప్పాలి. ఒక్క రోజులో మహేశ్వరం నియోజకవర్గానికి రూ.301 కోట్ల అభివృద్ధి నిధులు మేం తెచ్చినం. మరి కేంద్రం ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చిందో, వచ్చిన పైసలెన్నో దమ్ముంటే బీజేపీ నాయకులు చెప్పాలి.
– కే తారకరామారావు, పురపాలకశాఖ మంత్రి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, జనవరి 29 : దేశంలో అత్యంత పురోగమనశీల, ప్రగతికామ రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ర్టానికి అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తున్నదని పురపాలన, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీల్లో రూ. 371.9 కోట్ల అభివృద్ధి పనులకు శనివారం విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, మేయర్లు, డిప్యూటీ మేయర్లతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గానికి కేంద్రం నుంచి వెయ్యి కోట్ల ప్యాకేజీ తేవాలని బీజేపీ నేతలను డిమాండ్‌చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం, పిల్లల్ని రెచ్చగొట్టి మంత్రుల కాన్వాయ్‌కు అడ్డుపడేలా చేయటం వంటి చిత్ర, విచిత్ర విన్యాసాలు రాజకీయం కాదని, రాజకీయాలంటే అభివృద్ధిలో పోటీపడాలని చురకలు అంటించారు. కావాలంటే.. తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల పింఛను ఇస్తే కేంద్రం రూ.4 వేలు ఇవ్వాలని చెప్పారు.
యూపీ, బీహార్‌ను సాదుతున్నం
దేశంలో భౌగోళికంగా తెలంగాణ పదకొండో రాష్ట్రమని, జనాభాపరంగా 12వ రాష్ట్రమని, కానీ దేశ ఎకానమీలో నాలుగో అతి పెద్ద రాష్ట్రమని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని మంత్రి గుర్తుచేశారు. వెనుకబడిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాలను సాదుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉన్నదని, ఇక్కడి ప్రజల చెమట, రక్తం.. పన్నుల రూపంలో దేశాభివృద్ధికి ఉపయోగపడుతుండటం మనకు గర్వకారణమని చెప్పారు. రాష్ర్టానికి దన్నుగా నిలువాల్సిన బీజేపీ నేతలు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌కు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరితే 15-16 నెలలైనా అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అదే గుజరాత్లో వరదలు వస్తే విమానంలో పోయి రూ.వెయ్యి కోట్ల సాయం చేశారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అడ్డుకోలేదని, మతం పేరుతో రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని మంత్రి హెచ్చరించారు.
సర్కారు బడులను బాగుచేసుకొంటున్నాం
రాష్ట్రంలోని 26 వేల బడులను ‘మన ఊరు-మన బడి’ కింద రూ.7,289 కోట్లతో బాగు చేసుకోబోతున్నామని కేటీఆర్ చెప్పారు. అయితే, కేంద్రం మాత్రం తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాలను కూడా ఇవ్వలేదని అన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తే రాష్ర్టానికి ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. 16 ఐఐఎంలు, ఐసర్ సంస్థను దేశంలో ఇతర రాష్ర్టాల్లో ఏర్పాటు చేసింది తప్ప తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ‘రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నది. మిషన్ భగీరథ పథకాన్ని కాపీకొట్టి హర్ ఘర్ జల్ పేరుతో అమలు చేస్తున్నది. రైతుబంధు పథకాన్ని పదకొండు రాష్ర్టాలు వివిధ పేర్లతో వాళ్ల రాష్ర్టాల్లో అమలు చేస్తుండగా, కేంద్రం పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తున్నది. ఎకానమీలో దేశంలోనే తెలంగాణ 4వ రాష్ట్రంగా ఉందన్న వాస్తవం రిజర్వ్ బ్యాంకు సర్వేలోనే వెల్లడైంది’ అని కేటీఆర్ అన్నారు.
ఇంతటి సంక్షేమం ఇంకెక్కడా లేదు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏటా రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రేషన్ బియ్యంపై సీలింగ్ ఎత్తివేసి ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. పేద ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మనుమడు ఏ బియ్యంతో భోజనం చేస్తున్నాడో.. ప్రభుత్వ పాఠశాలలు, హస్టల్ విద్యార్థులకు అదే సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదని వివరించారు. ఉన్నత విద్య కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేసిందని, అంబేద్కర్ ఓవర్సీస్, జ్యోతిబాపూలే పథకాల కింద ఒక్కో విద్యార్థి ఉన్నత చదువుల కోసం రూ.20లక్షలు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మా ఇంటి ముందు పుట్‌పాత్ కడుతలేరు!
ట్విట్టర్లో పిల్లోడి ఫిర్యాదు.. వెంటనే స్పందించిన కేటీఆర్
మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో సమస్యలకు ఆయన ట్విట్టర్ వేదికగా పరిష్కారం చూపుతారు. ఈ క్రమంలో ఓ పిల్లోడు తమ వీధిలోని సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చి ఆకట్టుకొన్నాడు. ‘కేటీఆర్ సర్.. నేను బౌద్ధనగర్ రామాలయం వెనుక వీధిలో ఉంటాను. మాకు బ్లూ కలర్ ఎర్టిగా కారు ఉన్నది. ఈ కంప్లెయింట్ చేస్తున్నందుకు క్షమించండి. మా వీధిలో ఫుట్‌పాత్ కడుతామని, కారు పార్క్ చేయొద్దని జీహెచ్ఎంసీ వాళ్లు చెప్పారు. ఫుట్‌పాత్ కోసం తవ్వకాలు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఫుట్‌పాత్ కట్టలేదు’ అని కార్తికేయ అనే పిల్లాడు పేపర్‌పై రాశాడు. దాన్ని ఆ పిల్లాడి మేనమామ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. స్పందించిన మంత్రి ‘క్యూట్.. కానీ, యంగ్ కార్తికేయ నుంచి తీవ్రమైన ఫిర్యాదు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ దీన్ని వ్యక్తిగతంగా పరిష్కరించాలని, ఫిర్యాదుదారుని ఫొటో పంపాలని అభ్యర్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. వెంటనే జోనల్ కమిషనర్ ఆ పిల్లోడి ఇంటికి వెళ్లా రు. కార్తికేయతో మాట్లాడారు. సోమవారం నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ జోనల్ కమిషనర్‌కు ధన్యవాదాలు తెలిపారు.