గీసుగొండ, మే 5 : రైతుల సమస్యలను తెలుసుకునేందుకే కేసీఆర్ తమను ఇక్కడికి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను కేటీఆర్ కు చెప్పుకోగా, ‘అధైర్యపడొద్దు.. మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులతో కేటీఆర్ సంభాషణ ఇలా జరిగింది.
కేటీఆర్ : ఏం పేరు అమ్మా.. ఏ ఊరు మీది?
రైతులు : నా పేరు బానోత్ భాగ్యలక్ష్మి, మరో రైతు అజ్మీరా బుజ్జి, పోచ్చమ్మతండా, సంగెం
కేటీఆర్ : కేంద్రానికి వచ్చి ఎన్ని రోజులైంది?
రైతులు : సార్ 20 రోజులైంది. రోజూ ఇంటికీ కేంద్రానికి తిరుగుతున్నం. కాంటా పెడ్తలేరు.
రైతులు : ఎకరానికి 40 క్వింటాళ్ల మక్కలు పండితే ప్రభుత్వం 20 క్వింటాళ్లే కొంటాంది. మిగిలినయి ఎక్కడ అమ్మాలె సారు?
కేటీఆర్ : ఎరువులు మంచిగ వచ్చినయా?
రైతులు : ఎక్కడ సార్! బస్తాల కోసం తెల్లందాక లైన్లో నిలవడ్డం. పంటను అమ్మకుందామంటే కేంద్రాల్లో పడుకుంటున్నం.
రైతులు : కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఊరికో కేంద్రం పెట్టి వడ్లు కొన్నడు. వర్షానికి తడిస్తే ఎకరానికి పది వేల సాయం చేసిండు, రేవంత్రెడ్డి మాత్రం మా గోస పుచ్చుకుంటాండు.
కేటీఆర్ : రైతుబంధు వచ్చిందా అమ్మా?
రైతులు : ఒక్క ఎకరానికే పడ్డయ్.
కేటీఆర్ : బస్తాలు, దారం ఇస్తున్నారా?
రైతులు : రూ.56 వసూలు చేస్తున్నరు. కేంద్రానికి వస్తుంటే మావాళ్లకి యాక్సిడెంట్ అయింది, లారీల కిరాయిలు మమ్ముల్నే అడుగుతున్నరు.
కేటీఆర్: సీఎం రేవంత్రెడ్డి మక్కలు కొని డబ్బు లు ఇచ్చేటట్టు కనిపిస్తాడు. కానీ పట్టించుకోడు. అధైర్యపడవద్దు. మీకు కోసం సార్ కేసీఆర్ మమ్మల్ని ఇక్కడికి పంపిండు. మీ కోసం పోరాటం చేస్తాం ధైర్యంగా ఉండండి.
మహిళా రైతులు : వర్షం వస్తే మా బతుకు ఆగమైతది.. ఏం చేయాల్నో ఆర్థంమైతలేదు.
కేటీఆర్: ప్రభుత్వంపై పోరాటం చేసి మక్కజొన్నలు కొని వెంటనే డబ్బులు ఇచ్చేలా చేస్తాం.