MP Suresh Reddy | ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో దేశమంతా ఏకతాటిపైకి వచ్చింది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒకే గొంతుకై అమరవీరుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించడం, దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మన దేశ స్ఫూర్తిని చాటిచెప్పింది. వెనువెంటనే కేంద్రంలోని మోదీ సర్కారు ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టడంతో ఇక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పీచమణచడం ఖాయమని అంతా సంబురపడ్డారు. కానీ, నాలుగు రోజులు గడిచాయో లేదో ‘యుద్ధం ముగిసింది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిడుగు లాంటి వార్త చెప్పారు. యుద్ధం జరిగినన్ని రోజులు భారత్‌దే పైచెయ్యిగా ఉన్నప్పటికీ, ఇలా ఆకస్మాత్తుగా వెనుకడుగు వేయడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు.
రెండు దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం కలగజేసుకొని పోరును ఆపడం సబబేనని నేను కూడా మొదట భావించాను. మనది శాంతికాముక దేశం కదా! దేశ ప్రజలు కూడా ఆ తర్వాత కాల్పుల విరమణను స్వాగతించారు. కానీ, ‘యుద్ధాన్ని ఆపకపోతే వాణిజ్యం సంబంధాలను తెంచుకుంటానని చెప్పడంతోనే పాక్, భారత్‌లు దారికొచ్చాయి’ అని రెండు రోజుల తర్వాత ట్రంప్ చేసిన మరో ట్వీట్‌ను చూసి నిశ్చేష్టుడినయ్యాను. ‘స్టాప్ వార్ నో ట్రేడ్’ అని చెప్పి రెండు దేశాల మధ్య అణుయుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పడం బాధాకరం. అందుకు బదులుగా ‘స్టాప్ వార్ నో టెర్రర్’ అని చెప్పి యుద్ధాన్ని ఆపితే మన దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చినట్టు ఉండేదని నాతోపాటు యావత్ భారత్ ఆనాడు భావించింది. దేశ సరిహద్దులో జరిగిన పోరులో గెలిచిన భారత్.. ఈ విషయంలో ఓడిపోవడానికి మోదీ సర్కారు దౌత్యపరమైన వైఫల్యమే ప్రధాన కారణం.
ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను మనమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నాం. నాలుగో టెస్టును అందరూ చూసే ఉంటారు. ఆ టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ లీడ్ తీసుకున్నది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సున్నా పరుగులకే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది.
కానీ, పట్టు వదలని భారత బ్యాటర్లు క్రీజులో నిలిచి ఇంగ్లండ్ స్కోరును దాటేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ డ్రాకు అంగీకరించినా భారత బ్యాటర్లు ససేమిరా అన్నారు. జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేశారు. మరో రోజు ఉండి ఉంటే భారత్ గెలిచేదే. అయితే, ఈ మ్యాచ్ గెలిపించేందుకు భారత కెప్టెన్‌కు సమయం లేకుండాపోయింది. కానీ, పాక్‌తో పోరులో గెలిచేందుకు మన ప్రధాని మోదీ వద్ద ఎంతో సమయం ఉండే. అయినా అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన ఈ పోరు నుంచి తప్పుకొన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహించి ఆపడం తప్పు కాకపోవచ్చు. కానీ, ట్రంప్ చేసింది వేరు. ఆయన మన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకున్నారు. మన దేశం తరఫున ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, యుద్ధాన్ని తానే ఆపానని పదేపదే ప్రకటించారు. అయినా ప్రధాని మోదీ ఆయన వ్యాఖ్యలను ఖండించలేదు. మన దేశ సార్వభౌమాధికారం దృష్ట్యా ఇది ఏ మాత్రం సముచితం కాదు.
పాకిస్థాన్ ఒక విఫల దేశం. వారి రాజకీయ, మిలటరీ నాయకత్వాలు రెండూ అవినీతిమయమే. తమ దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలనే ఉద్దేశం, ఆసక్తి కూడా వారికి లేవు. వారిని ఎప్పుడు పేదరికంలోనే ఉంచాలన్నది అక్కడి పాలకుల భావన. వారి ఆర్థిక, మౌలిక వసతుల గణాంకాలను చూస్తే ఈ విషయం మనకు అవగతమవుతుంది. సింధూ జలాలను నిలిపివేయడమనేది అక్కడి నాయకత్వాన్ని పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. కాబట్టి, మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కశ్మీర్‌ను అడ్డుపెట్టుకొని పాకిస్థాన్ మొదటినుంచి రాజకీయాలు చేస్తున్నది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్‌కు సింధూ జలాలను నిలిపివేసినట్టు కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్తున్నది. కానీ, కశ్మీర్లో మౌలిక వసతుల కల్పన, దాని అభివృద్ధి పట్ల కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత కృషి చేశాయి. ప్రధానంగా ఎకనామిక్, ఫైనాన్షియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్ట్ జరిగాయి. కానీ, ఎమోషనల్ కనెక్ట్ ఆశించినంతగా జరగలేదు. ఈ మౌలిక సదుపాయాల కారణంగా దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. అది సంతోషమే. కానీ, కశ్మీర్ నుంచి ఎంత మంది బయటకు వస్తున్నారు? ఉన్నత చదువుల కోసం గాని, ఉద్యోగ అవకాశాల కోసం గాని, వ్యాపార సంబంధాల కోసం గాని ఎంత మంది బయటకు వస్తున్నారు? తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎంతమంది భావిస్తున్నారు? అంటే సమాధానం చెప్పడం కష్టం. కశ్మీర్ పండిట్లకు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మంచిదే. అలాగే మిగతా వర్గాలకూ ఇదే విధంగా అవకాశం కల్పిస్తే కశ్మీరీలు దేశంలోని ఇతర ప్రజలతో మమేకమవుతారు. కశ్మీర్‌ను ప్రగతిపథంలోకి నడిపిస్తే స్థానికుల్లో తమ ప్రాంతం పట్ల ఆ భావన కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలు పన్నులుగా కడితే, 40 రూపాయలు మాత్రమే తిరిగి వస్తున్నాయి. మిగిలిన 60 రూపాయలను కశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్‌ను నియంత్రించేందుకు కేంద్రం మళ్లిస్తున్నది. అదే ఆ ప్రాంతంలో మౌలిక వసతులను పెంచితే, ఒక ఫార్ములా ప్రకారం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, అక్కడి వారిలో ‘ఇది మన ప్రాంతం’ అనే భావన పెంపొందుతుంది. ఆ ప్రాంతంలో దేశ భక్తి పెరుగుతుంది. అప్పుడు శాంతిభద్రతల కోసం ఇంత భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
2014లో స్వరాష్ట్రంగా ఏర్పడినప్పుడు తెలంగాణ కూడా వెనుకబడిన ప్రాంతమే. కరువుతో అల్లాడుతున్నది. నిరుద్యోగం తాండవిస్తున్నది. కరెంటు లేదు. పరిశ్రమలు లేవు. వ్యవసాయ రంగం కుంటుపడింది. రైతుల ఆత్మహత్యలు. ఏ రంగంలో చూసినా మౌలిక సదుపాయాలే లేవు. కశ్మీర్ లాగానే నిరుద్యోగ యువకులు ఇక్కడి తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. తీవ్రవాద సమస్య ఎక్కువైంది. తొలి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌కు సమస్యలే స్వాగతం పలికాయి. అలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ ఒక విజన్, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లిన కేసీఆర్.. తెలంగాణ రూపురేఖలను సమూలంగా మార్చేశారు. ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి తొమ్మిదిన్నరేండ్లలోనే కొత్త రాష్ర్టాన్ని దేశ పటంలో సగర్వంగా నిలిపారు. ‘కేసీఆర్ ఫార్ములా’తోనే ఈ అద్భుతం సాధ్యమైంది.
ఎన్నో అత్యద్భుతాలను ఆవిష్కరించిన కేసీఆర్ ఫార్ములాను జమ్మూకశ్మీర్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు ఒకవేళ ‘కేసీఆర్ ఫార్ములా’ అని పిలవడం ఇష్టం లేకపోతే, ‘తెలంగాణ ఫార్ములా’ అని పిలవండి. అందుకు ఏ మాత్రం అభ్యంతరం లేదు. కేసీఆర్ ఫార్ములా మూలంగా కశ్మీర్ ప్రగతిపథంలో దూసుకెళ్లి, తద్వారా ఉగ్రవాద సమస్య సమసిపోయి, ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రత కోసం ఖర్చు చేసే భారీ నిధులతో ఈ దేశం అభివృద్ధి చెందితే చాలు.
ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. అయితే, ఆపరేషన్ సిందూర్ సమయంలో మన మిలటరీకి సంబంధించి పలు లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశ శ్రేయస్సు దృష్ట్యా ఎక్కడా, ఏ లోటు లేకుండా సైన్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకు అవసరమైన నిధులను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలి. పరిశోధన వసతులను అందుబాటులోకి తేవాలి. ఈ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా కాకుండా ఒక మిషన్ మోడ్‌లో చేపట్టాలి.
యుద్ధ సమయంలో మన దేశం దౌత్యపరంగా చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అందుకే, సాధారణ దౌత్యంతో పాటు పార్లమెంటరీ దౌత్య చానల్‌ను కూడా యాక్టివేట్ చేయాలి. సాధారణ దౌత్యానికి కొన్ని పరిమితులు ఉంటాయి. దౌత్యవేత్తలు వారి అధికార పరిధికి లోబడి పని చేయాల్సి ఉంటుంది. కానీ, పార్లమెంటరీ దౌత్యం అందుకు భిన్నంగా ఉంటుంది.
వారికి విస్తృతమైన పరిధి ఉంటుంది. వారి అవగాహన, ఆలోచనా ధోరణి వేరుగా ఉంటుంది. వివిధ దేశాల్లో అనేక వర్గాలతో చర్చించే, సమావేశమయ్యే అవకాశాలు వారికి ఉంటాయి. విదేశాల్లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశాలు తరచుగా జరుగుతుంటాయి. అలాంటి సమావేశాలను మన దేశంలోనూ నిర్వహించాలి. తద్వారా మన అభిప్రాయాలను ఇతర దేశాలకు చెప్పే అవకాశం ఏర్పడుతుంది. ఇటీవల బ్రిక్స్, క్వాడ్, యూఎన్వో సహా వివిధ వేదికలపై ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రధాని మోదీ పలు తీర్మానాలు చేయించారు. అయితే, ఆయా దేశాలు లే దా సంస్థలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మా నం చేశాయే గానీ, పాక్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై మిన్నకుండిపోయాయి. గత దశాబ్ద కాలంగా దేశంలో ఏర్పడిన వాతావరణం, పాలకులు చేస్తున్న ప్రకటనలు, మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా అమెరికా, యూరప్ లాంటి దేశాలు దీన్ని హిందూ వర్సెస్ ముస్లిం దేశాల మధ్య పోరుగా భావించాయి. వాస్తవానికి ‘సెక్యులర్ స్టేట్ వర్సెస్ టెర్రర్ స్టేట్’గా ఈ పోరును ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సింది.
గతంలో అనేక దేశాల ప్రతినిధులు పార్లమెంటరీ దౌత్యవేత్తలుగా మన దేశాన్ని సందర్శించేవారు. నేను ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్‌గా ఉన్నప్పుడు మలేషియా, పాకిస్థాన్‌కు చెందిన పలువురు ప్రతినిధులు హైదరాబాద్‌కు విచ్చేశారు. భారతదేశంలో ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఉంటుందా, లేదా? అనే అనుమానంతో వారు ఇక్కడికి వచ్చారు. అసెంబ్లీ పక్కనే ఉన్న మసీదులో ప్రార్థనలు చేసేందుకు అవకాశం ఉంటుందా అని నన్ను అడిగారు. దీంతో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో మాట్లాడి మక్కా మసీదులో అందుకు ఏర్పాట్లు చేయించాను. లక్షల మందితో కలిసి అక్కడ వారు ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో భారత్‌లో ముస్లింలకు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఉండవని అప్పటివరకు ఉన్న వారి దృక్పథం, ఆలోచనా ధోరణి మారిపోయాయి. పార్లమెంటరీ దౌత్య ప్రభావం ఈ విధంగా ఉంటుంది. అందుకే ఇప్పటికైనా పార్లమెంటరీ దౌత్యవేత్తల పర్యటనలను పెంచాలి. అప్పుడే ఇతర దేశాలతో మన దౌత్య సంబంధాలు మెరుగుపడతాయి.