రంగారెడ్డి/వికారాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : ‘నమ్ముకున్న అక్కలను ముందు వరుసలో కూర్చొబెట్టిన’ అని అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, నిన్నగాక మొన్న రాఖీ కట్టించుకొని, ఈ రోజు కొండా సురేఖ గొంతు పిసికిండని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, వికారాబాద్ జిల్లా మర్పల్లి, నవాబ్‌పేటలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో మహిళలకు చేసిన మోసాలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నది ఎంత అబద్ధమో, మహిళా ప్రజాప్రతినిధులకు న్యాయం చేస్తామనడం కూడా అంతే అబద్ధమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అమలుచేస్తామన్న హామీలకు వెయ్యి రోజులైనా అతీగతి లేదని ఎద్దేవాచేశారు. అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదని, రూ.2 లక్షల రుణాలపై ఉన్న వడ్డీని చెల్లించినప్పటికీ మాఫీ చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఉన్న ఇద్దరు మహిళా మంత్రుల్లో…ఒకరిని బర్తరఫ్ చేసి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మీతో పాటు ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు మాసం బంగారం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, స్కూటీ హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు.