హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని అజామాబాద్ ఇండస్ట్రీకి సంబంధించిన భూమిని తమకే కేటాయించాలని ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రైవేట్‌కు అప్పగించొద్దని, ఆ భూ మిలో తామే పొజిషన్లో ఉన్నామని తెలిపింది. ప్రైవేట్ కంపెనీ చెల్లించే డబ్బులు తామే చెల్లిస్తామని తెలిపింది. భూమికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఆయిల్‌ఫెడ్ ఎండీ ప్రభుత్వానికి అందజేశారు. ఆజామాబాద్ ఇండస్ట్రీకి చెందిన ప్లాట్ నంబర్-1లోని 17,261 గజాల స్థలం (నాలుగు ఎకరాలు)లో 15,445 గజాలను(మూడున్నర ఎకరాలు) గంపగుత్తగా దయారాం సూరజ్మాల్ లోహితీ ఆయిల్మిల్స్కు కేటాయించింది. ఇందులో ఆయిల్‌ఫెడ్‌కు కేవలం 1,816 గజాలు మాత్ర మే కేటాయించింది. దీనిపై ఆయిల్‌ఫెడ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. సంబంధించి నివేదికను అందించింది.
భూమి హక్కుల కోసం ప్రైవేట్ కంపెనీ రూ.87.44 కోట్లు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయిల్‌ఫెడ్ పేర్కొంది. అత్యంత విలువైన భూమిని కాజేసేందుకు ముఖ్యనేత ముఠా కుట్రలు చేస్తున్నట్టుగా ఆరోపణ లున్నాయి. అందుకే ప్రైవేట్ కంపెనీని ముందుపెట్టి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నట్టుగా తెలిసింది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ఆగస్టు 12న ‘500 కోట్ల భూమి హాంఫట్’ శీర్షికన సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆయిల్‌ఫెడ్ అధికారులు ఆగమేఘాలపై నివేదికను సిద్ధం చేశారు. ఆ తర్వాత హరీశ్‌రావు నేరుగా రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ భూ ఆక్రమణను అడ్డుకోవాలని, ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు.