Assam | దిస్పూర్: అస్సాం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఒకేవిధమైన చట్రాన్ని ఏర్పాటు చేసే ‘అస్సాం ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (కంపల్సరీ) రూల్స్ 2026’కు మంత్రివర్గం ఆమోదం లభించిందని సీఎం తెలిపారు. ఇక నుంచి ముస్లిం వివాహాలను రిజిస్ట్రార్లు నమోదు చేస్తారని అన్నారు.
వివాహాల నమోదులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుల సంఖ్య పెరిగితే దశలవారీగా మరికొంతమంది అధికారులను రిజిస్ట్రార్లు (Registrar)గా నియమిస్తామని అన్నారు. గత ప్రభుత్వం ముస్లిం వివాహాలను నమోదు చేయవద్దని ఖాజీలను నియంత్రించింది. కానీ దీనికోసం ప్రత్యామ్నాయం మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రిజిస్ట్రేషన్ ద్వారా ముస్లిం వివాహాలను సక్రమంగా నమోదయ్యేలా చూడటమే తమ ప్రభుత్వం ఉద్దేశమని హిమంత పేర్కొన్నారు.
కొత్త చట్టం అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్సీ యాక్ట్ 2024 ఆధారంగానే నమోదు చేస్తుందని సీఎం వెల్లడించారు. ఈ 2024 యాక్ట్ 1935లో అమల్లోకి వచ్చిన అస్సాం ముస్లిం మ్యారేట్ అండ్ డైవర్సీ చట్టం స్థానంలో వచ్చింది. దీని ప్రకారం ముస్లిం వివాహాలు, విడాకులు స్వచ్ఛంద రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండేది. కానీ 2010లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని సవరణ చేశారు. 2024లో తీసుకొచ్చిన చట్టం మైనర్ల వివాహానికి సంబంధించిన నిబంధనను తొలగించింది. అయితే ముస్లిం మహిళలకు కనీసం 18 ఏండ్లు, పురుషులకు 21 ఏండ్లు నిండినవారి వివాహాలనే రిజిస్ట్రేషన్ చేయాలని కొత్త
చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం హిమంత బిశ్మ శర్మ పేర్కొన్నారు.
అదేవిధంగా కొత్త చట్టం రిజిస్ట్రేషన్ ప్రక్రియను లైసెన్స్ (License) పొందిన ముస్లిం రిజిస్ట్రార్లు లేదా ఖాజీల నుంచి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అధికారులకు బదిలీ చేసింది. వయసు, నివాస సర్టిఫికెట్లతో పాటు దరఖాస్తుకు 30 రోజుల ముందు అభ్యంతరాల గడువుకు వీలు కల్పించింది.