హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ):స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిజంగా ప్రజాబలం ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ టికెట్‌పై గెలువాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఎవరికి ప్రజాబలం ఉన్నదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్‌లో ఉంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సిన కర్మ ఏమిటని ఎద్దేవా చేశారు.
పలు వివాదాలకు మంత్రి కొండా సురేఖ కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, ఆమె పైకి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మల్యే కడియం శ్రీహరిని ముఖ్యనేత ఎగదోస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కడియంను ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కడియం శ్రీహరి మెంటాలిటీ చాలా కన్నింగ్ మెంటాలిటీ. ఆయన ఎప్పుడూ ఎదుటివాళ్లు తనకంటే హై లెవెల్లో ఉంటే ఓర్వలేడు.
గతంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పని చేసి, ఇప్పుడు ఒక సామాన్య ఎమ్మెల్యేగా మసలడం ఆయనకు కష్టంగా ఉన్నది. అందుకే మాలాంటి వాళ్ల మీద పడి ఏడుస్తా ఉంటాడు’ అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి అనధికారికంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులో సమీక్ష నిర్వహించడం బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని, దీనిపై అధిష్ఠానం, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు.
వారు సానుకూలంగా స్పందించారని, వివరణ అడిగి చర్యలు తీసుకొంటామని చెప్పారని తెలిపారు. ‘అవగాహన లోపం’ అని ఒక మంత్రిని ఉద్దేశించి కడియం శ్రీహరి మాట్లాటడం చాలా చాలా తప్పు అని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలతో తనకు సఖ్యత ఉన్నదని, కడియం మాత్రమే కావాలని వివాదాలు రేపుతున్నారని పేర్కొన్నారు.
తమ రాజకీయ జీవితం ఒక రాజశేఖర్‌రెడ్డి హయంలో మినహా ఎప్పుడూ ముళ్లబాటలోనే నడుస్తున్నదని, తనను కావాలనే వివాదాల్లోకి లాగడం, బట్టకాల్చి మీదేయడం జరుగుతున్నదని కొండా సురేఖ చెప్పారు. కావాలనే వివాదాల్లో తమను ఇరికించి రాజకీయంగా అణగదొకాలని కొందరు యత్నిస్తున్నారని, అధిష్ఠానం తమను అర్థం చేసుకోవడం వల్లే ఇంకా మనగలుగుతున్నామని చెప్పడం కొసమెరుపు.