నేరేడుచర్ల, జూలై 9: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ప్రక్రియ అంతా గందరగోళంగా ఉంది. ఎన్నో ఏండ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది. ఓటరు జాబితో పేరు ఉన్న వారి పరిస్థితి ఒకలా ఉంటే.. జాబితాలో పేరు లేని వారి పరిస్థితి మరోలా ఉంది. జూన్ రెండో వారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియకు సంబంధించి బీఎల్వోలు ఫారాలు మాత్రం పంపిణీ చేశారు. కానీ వాస్తవంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మరణించిన వారి ఓట్లు మొదలుకొని అడ్రస్సులు గల్లం తు, ఒకే వార్డులో ఉండాల్సిన ఓటు మరో వార్డులో నమోదు, అద్దె ఇండ్లల్లో ఉంటూ ఓటేసిన వారు, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన వారి పరిస్థితి ఏంటన్నది అర్థ్ధం కావడం లేదు. 2002 ఓటరు జాబితాతో ముడి పెట్టడంతో చాలా మంది ఓట్లు కనిపించడం లేదు. మరి కొంత మంది పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓటరు జాబితాలో భార్య పేరు ఉంటే భర్త పేరు లేదు.. భర్త పేరు ఉంటే భార్య పేరు లేదు.
అన్నీ చిక్కు ముళ్లే..
జిల్లాలోని బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం, తర్వాత వాటిని స్వీకరించే సమయంలో స్థానికంగా లేకపోవడం, చిరునామాల మార్పులు, మరోవైపు 2002 ఎన్నికల్లో ఓటేసినా ప్రస్తుత జాబితాలో పేర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న వారు అనేక మంది. అలా గే ఒంటరిగా ఉన్న వారికి సంబంధించి రెఫరెన్స్ విషయం లో సమస్య తలెత్తుతోంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు పట్టణ, గ్రామ స్థాయిలోఎదురవుతున్నాయి. ఈనెల 24వ తేదీలోగా ఈ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో గడువు పెంచాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది.
విదేశాల్లో ఉన్నవారి పరిస్థితి ఏమిటీ..
చాలా గ్రామాల్లో ఉపాధి నిమిత్తం కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, లం డన్ తదితర దేశాలకు వలస వెళ్లారు. వీరి చిరునామాలు కనుగొని వారికి సమాచారం పంపించడంతోపాటు వారి వివరాలు సేకరించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అం దించి తెప్పించే ప్రయత్నం చేస్తున్నా ఓటరు జాబితాలో పేరు ఉంటుందా.. లేదా అనే అనుమానం. పైగా విదేశాల నుంచి ఓటుకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వీలుకాదని పలువురు పేర్కొంటున్నారు.
శ్రమ వృథా అవుతోంది..
బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేశారు. అయితే వీటిని నింపి ఇవ్వడం లేదని చెబుతున్నారు. వీటికి తోడు అందిన వివరాలను సకాలంలో డిజటలైజ్ చేయకపోతే మొత్తం ప్రక్రియ ఆలస్యమయే ప్రమా దం ఉంది. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు, తుది ఓటర్ల జాబితా తయారీ వంటి ప్రక్రియ వేగమయ్యే అవకాశం ఉంది.
ఓటర్లలో ఆందోళన..
సర్ ప్రక్రియ నేపథ్యంలో కొంత మంది ఓటర్లలో ఆందోళన నెలకొంది. అందుకు కారణం గతంలో ఓటు ఉంది వివిధ కారణాలతో ఓటు కోల్పొయిన వారు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. ఓటరు జాబితాలో పేరు కనిపించకపోవడంతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందా.. లేదా.. అన్న అనుమానాలు ఉన్నా యి. ఉదాహరణకు 2023లో ఒక వార్డులో ఓటు ఉంటే సదరు వ్యక్తికి తెలియకుండానే మరో వార్డుకు మారింది. దీంతో ఓటరకు తన ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఫారాలుపై అవగాహన లేక ఇబ్బందులు
ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకున్న వారు వాటిపైన సరైన అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకుండా బీఎల్వోలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఫారాలను ఓటర్లకు అందేలా చర్యలు చేపట్టారు. కానీ ఫారం ఎలా నింపాలో తెలియక చదువుకున్న వారు సైతం సతమతమవుతున్నారు. ఇక చదువు రాని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
చదువు రాదు.. ఫారం ఎలా నింపాలి..
ఫారం నింపే విషయంలో నాలాంటి చదువురాని వాళ్లు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఫారం నింపి మళ్లీ ఇవ్వమన్నారు. చదువురాని నాలాంటి వాళ్లు ఫారాన్ని ఎలా నింపుతాం. చదువుకున్న వాళ్లను అభ్యర్థించాల్సి వస్తోంది. ఓటర్లు బతికున్నారా లేదా చనిపోయారా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మళ్లీ కొత్తగా దరఖాస్తులు, ఫొటోలు ఇవ్వమంటున్నారు.
-మున్వర్, నేరేడుచర్ల
ఫారాలు పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు..
ఫారాలను బీఎల్వోలు పూర్తిస్థాయిలో పంపిణీ చేయ లేదు. ఇచ్చిన ఫారాలు ఎలా నింపాలో తెలియక చాలామంది అవస్థలు పడుతున్నారు. బీఎల్వోలు ఇంటింటీకి తిరిగి అవగాహన కల్పించడం లేదు. దీనికి తోడు గడువు దగ్గర పడుతుండటంతో ఓటు ఉంటుందా పోతుందా అని ప్రజల్లో అనుమానం. బీఎల్వోలు కార్యాలయాలలో కూర్చోని ఫారాలు నింపుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలి.
-పాండురంగారావు, మఠంపల్లి
మాకు అవగాహన లేదు..
సర్ ఫారాలు ఎలా నింపాలో తెలియక, అవగాహన లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బీఎల్వోలు ఇంటి అడ్రస్లు తెలియక ఫారాలు పంచడం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ కార్యక్రమం మంచిదైనప్పటికీ దానికి తగ్గట్టుగా అవగాహన లేకపోవడంతో నాలాంటి వారు చాలా అవస్థలు పడుతున్నాం. 2002 ఓటర్ లిస్టులో మా పేర్లు దొరక్క ఇబ్బంది అవుతోంది.
– కంకణాల నారాయణ, గోవిందాపురం రైతు