హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కుమారుడు, పోక్సో కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్‌కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్‌హెచ్‌వో ముందు ఎనిమిది వారాలపాటు, లేదంటే చార్జిషీటు దాఖలు చేసేదాకా పిటిషనర్ హాజరు కావాలని చెప్పింది.
బాధితురాలి నివాసం, విద్యాసంస్థలు, పనిచేసే ప్రాంతాలకు పిటిషనర్ వెళ్లరాదని, అదేవిధంగా బాధితురాలు, ఫిర్యాదుదారు, సాక్షులను ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేయరాదని షరతు విధించింది. ఈ కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయరాదని, మెసేజ్, ఆడియో, ఎలక్ట్రానిక్ వీడియోలను వ్యాప్తి చేయరాదని, ఇంటర్వ్యూలు, పత్రికా ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టంచేసింది. పాస్‌పోర్టు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధి స్తూ బెయిల్ మంజూరు చేసింది.
బండి భగీరథ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కే సుజన గురువారం ఉత్తర్వులు వెలువరించారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి భగీరథ్‌కు బెయిలు మంజూరు చేశారు. పిటిషనర్ 55 రోజులుగా జైలులో ఉన్నారని, 25 మంది సాక్షులను విచారించిన నేపథ్యంలో నిందితుడు నిర్బంధంలో ఉండాల్సిన అవసరంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
దర్యాప్తు దాదాపుగా పూర్తయిందని, అభియోగ పత్రం దాఖలు చేయాల్సి ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. నిందితుడు పారిపోవడం, దర్యాప్తునకు అడ్డంకి లేదని కోర్టు సంతృప్తి చెందినపుడు దర్యాప్తు పూర్తయ్యేదాకా నిర్బంధంలో ఉండాల్సిన అవసరంలేదని, కఠినమైన షరతులు విధించవచ్చని అన్నారు. పూచీకత్తుతోపాటు షరతులను ఉల్లంఘించినట్లయితే ప్రాసిక్యూషన్ బెయిల్ రద్దుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.