హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9(నమస్తే తెలంగాణ): మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం తొలిదశ పనులకు పాలనాపరమైన అనుమతులు, అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీచేసింది. తొలివిడత 21 కిలోమీటర్ల ప్రాజెక్టు పనుల కోసం రూ.7,345.12 కోట్ల మంజూరుకు అనుమతులు ఇచ్చింది.
జోన్1ఏ, జోన్1బీ కారిడార్లలో ఈ అభివృద్ధి పనులు జరుగనున్నాయి. దీనిలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకూ 11.80 కిలోమీటర్ల మేర ఈపీసీ విధానంలో పనులు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పనుల కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రూ.4,500 కోట్ల భారీ రుణసాయం పొందాలని, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ వంటి సంస్థల నుంచి మిగతా రూ.2,845.12 కోట్లను గ్రాంట్ల రూపంలోనే కేటాయించాలని సర్కార్ ఆదేశించింది.
ఈ ప్రాజెక్టు కోసం నూటికి నూరు శాతం అప్పే తప్ప.. ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా పెట్టడం లేదు. ప్రభుత్వ నిధుల్లేకుండా, కేవలం గ్రాంట్లు, ఏడీబీ రుణాలు మంజూరు చేస్తుందనే ఆశతో తొలి దశ మూసీ ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు, అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పులు, గ్రాంట్లతో మూసీ అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ తీసుకొన్న నిర్ణయం రాష్ట్ర ఖజానాను మరింత అప్పుల ఊబిలో నెట్టేందుకేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం అప్పులపై ఆశపడటమంటే ప్రజలపై భారీ ఆర్థిక భారం తప్పదని చెప్తున్నారు. ఏడీబీ నుంచి భారీ రుణసాయం కోసం ఇంకా సంప్రదింపులు కొనసాగుతుండగా, తుది ఆమోదం వచ్చేంతవరకు రుణ లభ్యతపై స్పష్టత లేదని వారు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తాజాగా కేటాయించిన రూ.7,345.12 కోట్ల నిధులు కేవలం అభివృద్ధి పనుల కోసమేనని, భూసేకరణ వ్యయం కలుపలేదని తెలుపడం గమనార్హం. దీంతో బాధితుల గోడు పట్టించుకోక పోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రైవేట్ కన్సల్టెన్సీల లాభం కోసమే అడ్డగోలు అంచనాలతో, కేవలం నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.