హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): కొమురవెల్లి మల్లన్న ఆలయ (Komuravelli Mallanna Temple) ఆదాయానికి గండికొట్టేందుకు దేవాదాయ ధర్మాదాయశాఖతో అనుబంధమున్న ఓ వ్యక్తి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇప్పటికే స్వా మివారికి బంగారు కిరీటం ఉండగా దేవేరులైన గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మకు రెండు కిరీటాలు చేయించడానికి నిర్ణయించారు. ఒక్కో కిరీటం కేజీ ఉండేలా స్థపతి నేతృత్వంలో డిజై న్లు సైతం రూపొందించి దేవాదాయశాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించింది. డిజైన్లను పరిశీలించిన శాఖ కమిషనర్, మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక డిజైన్‌ను ఎంపిక చేయగా, కిరీటాల ఖర్చును దేవాలయ నిధుల నుంచే కేటాయించడానికీ అధికారులు సిద్ధమయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా..
దేవాలయ ఆదాయం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసే సమయంలో అందుకు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్‌ను పిలువాల్సి ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా చెన్నైకి చెందిన ఒక కంపెనీకి కిరీటాల తయారీ పనులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కిరీటాల తయారీలో వాటాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. రెండు కిరీటాలకు అయ్యే ఖర్చుపై స్థపతి, ఆలయ అధికారులు ఇచ్చిన అంచనాలు మించి అదనంగా మరికొంత చేర్చారని, ఈ వ్యవహారంలో ధార్మికమైన పదవిలో కొనసాగుతున్న ప్రముఖ వ్యక్తి తనకు పరిచయం ఉన్న ఎంటర్‌ప్రైజెస్‌కు పనులు అప్పగించి వాటాలు తీసుకుంటున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రికి తెలియకుండానే జరిగిందా?
రెండు బంగారు కిరీటాల తయారీకి సంబంధించి మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే ప్రతిపాదనలు రూపొందించినా మిగతా వ్యవహారంలో మంత్రి జోక్యం ఉందా.. లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. కాగా, ఆ వ్యక్తి మంత్రి దృష్టిలో పెట్టే పనులు చెన్నైకి చెందిన కంపెనీకి అప్పగించారని, అందులో తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని ఉన్నతాధికారులు మాట్లాడుకుంటున్నారు.
బాధ్యులెవరంటూ సందేహాలు?
పనులను నామినేటెడ్ పద్ధతిలో టెండర్ ఇవ్వాలంటే వెనుకాముందు ఆడుతున్నారని ఆలయ అధికారులంటున్నారు. కిరీటాల తయారీలో అవకతవకలు జరిగితే అందుకు దేవాలయ అధికారులే బాధ్యులయ్యే అవకాశముందని, ఈ విషయంలో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి టెండర్ ద్వారా పనులు చేయిస్తే బాగుంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అదీకాకుంటే ఓ కమిటీని నియమించి పనులను పర్యవేక్షిస్తే సమస్య ఉత్పన్నం కాదనే అభిప్రాయా న్ని సైతం వ్యక్తం చేస్తున్నట్టు వినికిడి. మంత్రి ముందు చర్చ జరిగినా ఎవరూ నోరు మెదపకపోవడంతో ధార్మిక ప్రముఖుడు సొంత ప్రయోజనాల కోసం చెన్నై కంపెనీ నుంచి కొటేష న్లు తెప్పించి ఖరారు చేయించినట్టు సమాచారం. కొమురవెల్లిలో మల్లన్న దేవేరులకు చేయిం చే రెండుకిలోల బంగారు కిరీటాల పేరుతో చెన్నై కంపెనీతో కుదుర్చుకున్న డీల్ ఆ ప్రముఖుడికి మరోసారి వర్కవుట్ అవుతుందంటూ ఆ శాఖలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.