K Ramp Movie Review | ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కె-ర్యాంప్ (K Ramp). హాస్య మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మించగా.. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తాజాగా ఈ చిత్రం దీపావళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
ధనవంతుడి కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం). ఎంసెట్‌లో ఫెయిల్ అయినా రోజు తాగుతూ.. బాధ్యత లేకుండా బలదూర్‌గా తిరుగుతుంటాడు. అయితే కొడుకు మీద ఉన్న ప్రేమతో అతడిని ఏమనకుండా తండ్రి (సాయి కుమార్) మౌనంగా ఉంటాడు. ఇదిలావుంటే తన కొడుకుని గాడిలో పెట్టాలని జ్యోతిష్యుడి సలహా మేరకు కుమార్‌ను మెడిసిన్ చదివించడానికి కేరళకు పంపుతాడు. కేరళకి వెళ్లిన కుమార్ తన మామ(నరేష్)తో అక్కడ కూడా చిల్లరగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఒకసారి ఇలానే ఎక్కువగా తాగా ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఓ సందర్భంలో కుమార్‌ని రక్షిస్తుంది మెర్సీ జాయ్ (యుక్తి తరేజా ). దీంతో ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా కుమార్‌ను ఇష్టపడుతుంది. ఇద్దరూ తమ ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో మెర్సీకి అరుదైన ఆరోగ్య సమస్య ఉందని తెలుస్తుంది. అయితే ఆ వ్యాధితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాధి ఎలా వచ్చింది? ఆమె కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ (వీకే నరేశ్) పాత్ర ఎంత కీలకమైంది? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
చిత్ర ప్రమోషన్లలో చెప్పినట్లుగానే ఈ చిత్రం లాజిక్స్ లేని పక్కా కామెడీ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. కథలో కొత్తదనం కోసం ట్విస్టుల కోసం వెతకకుండా థియేటర్‌కు నవ్వుకోవడానికి వెళ్లే ప్రేక్షకుడిని దర్శకుడు జైన్స్ నాని సంతృప్తి పరిచాడని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ హీరో క్యారెక్టరైజేషన్, రాజశేఖర్ పాటలకు కిరణ్ అబ్బవరం వేసే స్టెప్పులు, కేరళలో రొటీన్ ప్రేమకథలో వచ్చే ఊరమాస్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకాండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మెర్సీ ఆరోగ్య సమస్య వల్ల కుమార్ పడే ఇబ్బందులను ఫన్నీగా చూపించారు. ఈ భాగంలో వెన్నెల కిషోర్ ఎంట్రీతో నవ్వుల డోస్ మరింత పెరిగింది. నరేశ్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లో హిలేరియస్‌గా పండాయి. క్లైమాక్స్‌లో కథనం కొంచెం ఎమోషనల్ టచ్‌తో సాగుతుంది. నరేశ్ డైలాగులు, సాయికుమార్-కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
నటీనటులు
ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షోగా నిలిచాడు. యాక్షన్, కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో తన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం నరేశ్ పాత్ర. ఆయన స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ నవ్వులు పండాయి. ఇక సాయి కుమార్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్‌లు తమ పాత్రల పరిధి మేరకు నటించి సినిమాకు బలం చేకూర్చారు.
సాంకేతికంగా
సినిమా సాంకేతికంగా పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కేరళ లొకేషన్ల అందాలను బాగా చూపించారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. కొత్తదనం, లాజిక్స్ ఆశించకుండా.. కేవలం ఊరమాస్ కామెడీని ఆస్వాదించడానికి థియేటర్‌కు వెళితే.. కే ర్యాంప్ హాయిగా నవ్వుకునే మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది.
రేటింగ్ 2.75/5