K Ramp Review | కిరణ్ అబ్బవరంకు దీపావళి కలిసొచ్చింది. గతేడాది ‘క’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన దిల్ రుబా నిరాశ పరిచింది. ఈ దీపావళికి ‘కె – ర్యాంప్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ట్రైలర్, టీజర్ లో యూత్ ఫుల్ ఫన్ కనిపించింది. మరి ‘కె – ర్యాంప్’లో వినోదం ఆడియన్స్ కనెక్ట్ అయ్యిందా? కిరణ్ కి మరో దీపావళి హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.
కథ
కుమార్ (కిరణ్ అబ్బవరం) పుట్టుకతోనే సంపన్నుడు. తండ్రి కృష్ణ (సాయికుమార్) అతి గారబంతో సర్వం సమకూర్చుతాడు. కానీ కుమార్ కి చదువు పట్టదు. పైగా ఎప్పుడూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. తనని దారిలో పెట్టాలని కేరళలోని ఓ కాలేజ్ లో చేర్చుతారు. అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు కుమార్. అయితే మెర్సీకి ఓ మానసిక సమస్య వుంటుంది. ఆ సమస్య ఏమిటి? దానికి కారణంగా ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ: జీవితంలో బలాదూర్ గా తిరిగే ఓ అబ్బాయికి, ప్రామిస్ బ్రేక్ చేస్తే భరించలేని ఓ అమ్మాయికి మధ్య జరిగే కథ ఇది. చాలా చిన్న లైన్. ఈ కథని యూత్ ఫుల్ ఫన్ మూమెంట్స్ తో చూపించాలనేది దర్శకుడు ఉద్దేశం. అయితే రైటింగ్ టేకింగ్ లో కొత్తదనం లోపించింది. కిరణ్ చేసిన అల్లరి అక్కడక్కడా నవ్వించినప్పటికీ మిగతా చాలా బాగా బలవంతంగా ఇరికించినట్లుగా వుంటుంది. కథ కేరళకి మారిన తర్వాత ప్రేమకథ మొదలవుతుంది. హీరోయిన్‌కి ఉన్న సమస్య బయట పడటంతో కాన్ఫ్లిక్ట్ తెరపైకి వస్తుంది. ఇలాంటి కథలకి సెకండ్ హాఫ్ చాలా కీలకం. అయితే ఇక్కడ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఫన్ సరైన మోతాదుల్లో పండలేదు. ప్రాధాన జోడి మధ్య సరైన కెమిస్ట్రీ కుదరలేదు. దీంతో ఆ ప్రేమకథ తేలిపోయింది. అయితే కిరణ్ అబ్బవరం తన టైమింగ్ తో కొన్ని సీన్స్ లో ఫన్ క్రియేట్ చేయగలిగాడు.
నటీనటులు నటన: కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో ఇది. తనలో వున్న మాస్ చూపించాడు. మొత్తం తన భుజాలపై మోశాడు. యుక్తి తరేజా పాత్రని ఇంకాస్త బలంగా రాయాల్సింది. నరేశ్, సాయికుమార్, మురళీధర్ గౌడ్ తమ అనుభవం చూపించారు. వెన్నెల కిషోర్ కొన్ని నవ్వులు పంచాడు.
టెక్నికల్: చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఓనం సాంగ్ బావుంది. సతీశ్ రెడ్డి కెమెరా వర్క్ కలర్ ఫుల్ గా వుంది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. దర్శకుడు జైన్స్ నాని టేకింగ్ బావుంది కానీ రైటింగ్ లో ఇంకాస్త డెప్త్ వుండాల్సింది.
ప్లస్ పాయింట్స్
కిరణ్ అబ్బవరం నటన
కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ, కథనం
ప్రేమకథలో ఎమోషన్ లేకపోవడం
రేటింగ్: 2.75/ 5