నర్సాపూర్, అక్టోబర్ 18: టీచర్‌ను ఆటోలో ఎక్కించుకెళ్లి దోపిడీ చేసిన కేసును నర్సాపూర్ పోలీసులు 48 గంటల్లోనే చేధించారు. సీసీ కెమెరాల సాయంతో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శనివారం నాడు మీడియాకు వెల్లడించారు.
డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేటకు చెందిన ఉప్పరి సాయికుమార్, గొలుసుల కుమార్, కొల్చారం మండలం రంగంపేటకు చెందిన దారగుల్ల అనిల్ పాత నేరస్తులు. గతంలో పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లొచ్చారు. ఇటీవల జైలు నుంచి వచ్చిన వీరు తమ బుద్ధిని మార్చుకోకుండా మరోసారి దొంగతనానికి స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ఈ నెల 16న నవీన్ అనే వ్యక్తి ఆటోను తీసుకుని కొల్చారం బస్టాండ్ వద్ద తుంగని కిష్టయ్య అనే ఉపాధ్యాయుడిని ఆటోలో ఎక్కించుకున్నారు. నర్సాపూర్ సమీపంలోని తూప్రాన్ మార్గంలో ఉన్న ఓ కుంట వద్దకు తీసుకెళ్లి కిష్టయ్యపై దాడి చేశారు. చంపేస్తామని కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి రూ.1200 నగదు, మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అనంతరం పర్సును, కత్తిని కొద్దిదూరంలోని పొదల్లో వేసి వెళ్లిపోయారు.
దొంగల నుంచి తప్పించుకున్న టీచర్ కిష్టయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. టెక్నాలజీ సాయంతో పుల్కల్ మండలం శివంపేటలో ఉన్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును 48 గంటల్లోనే చేధించిన సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై రంజిత్ కుమార్, సిబ్బంది శ్రీకాంత్, ఉపేంద్రలను డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు.