న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో నానాటికీ సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటికి చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు అత్యంత వేగంగా, భీతికొల్పే విధంగా జరుగుతున్నాయి. మోసగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం శాఖ ‘కిల్ స్విచ్’ గురించి చర్చిస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు. బాధితులకు ఇలాంటి మోసం ఏదో జరుగుతున్నదని అనిపించగానే వెంటనే తమ ఫోన్లోనే ‘కిల్ స్విచ్’ను ఉపయోగించి మొత్తం లావాదేవీలను నిలిపివేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇది మన ఫోన్లోని బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్‌లలో ఎమర్జెన్సీ బటన్లాగా పనిచేస్తుంది. సైబర్ మోసగాళ్లు తమను లక్ష్యంగా చేసుకున్నారు లేదా తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే నగదు వెళ్లిపోతున్నట్టు అనిపించగానే బాధితులు వెంటనే ‘కిల్ స్విచ్’ బటన్‌ను ఉపయోగించవచ్చు. దీంతో తమ ఖాతా నుంచి జరిగే అన్ని లావాదేవీలు తక్షణం నిలిచిపోతాయి.