ఖైరతాబాద్, జనవరి 22 : పైసా పైసా కూడబెట్టి కాస్త భూమి కొనుక్కుంటే.. ప్రభుత్వ స్థలమంటూ హైడ్రా తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకుందని దివ్యానగర్ ఫేస్-1 ప్లాట్ల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ విద్యావేత్త నల్లమల్లారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండలం, కాచివానిసింగారంలోని సర్వే నం. 43 నుంచి 62 వరకు 250 ఎకరాల స్థలంలో 1988 నుంచి 2003 మధ్యలో సింగరేణి, పోస్టాఫీసు, రైల్వే శాఖలో పనిచేసే ఉద్యోగులతో పాటు అతి స్వల్ప ఆదాయం కలిగిన ఉద్యోగులుగా ఉన్న తాము నెలవారీ వేతనాల నుంచి ఆదా చేసిన డబ్బులతో చిన్న చిన్న ప్లాట్లు, కొంత వ్యవసాయ భూములను కొనుగోలు చేశామన్నారు. మొత్తం 2,160 మంది లబ్ధిదారులు భూ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. కొనుగోలు సమయంలో విద్యావేత్త నల్ల మల్లా రెడ్డి అగ్రిమెంట్ గార్డియన్‌గా వ్యవహరించారన్నారు.
కాగా, సర్వే నంబర్ 66లోని ఏపీ హౌసింగ్ బోర్డు సొసైటీకి 52-24 గుంటాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో సర్వే నం.62లోని వారికి సంబంధం లేని 6ఎకరాల 12 గుంటల భూమి సైతం సొసైటీదేనంటూ వాదిస్తూ, అది ప్రభుత్వ భూమిగా చిత్రీకరిస్తూ ఈ నెల 19న హైడ్రా తమ ప్లాట్లలో ఫెన్సింగ్ వేసిందని వాపోయారు. సుమారు 60 మంది లబ్ధిదారులైన తాము ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. హైడ్రా చర్యలతో తాము వీధిన పడే పరిస్థితి వచ్చిందని, విశ్రాంత ఉద్యోగులమైన తాము ఇండ్లు కట్టుకుందామనుకుంటే నీడ లేకుండా చేశారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
సర్వే నం. 62లో మాకు 1.15 ఎకరాలతో పాటు మరో 1.3 ఎకరాల భూమి కుటుంబ సభ్యుల పేరిట ఉంది. 34 సంవత్సరాల కిందట ఈ భూమిని కొనుగోలు చేశాం. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మొక్కజొన్న, ఇతర పంటలను వేసి నీళ్లు పెట్టాల్సి ఉంది. హైడ్రా వేసిన కంచె వల్ల పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఫెన్సింగ్ వేశారు. నిలదీసేందుకు వెళితే పోలీసులు అడ్డుకొని వెల్లగొడుతున్నారు.
– దివ్య, బాధితురాలు
పైసా పైసా కూడబెట్టి ప్లాట్లను కొనుగోలు చేస్తే హైడ్రా అన్యాయంగా మా ప్లాట్లను ఆక్రమించుకుంది. ఏపీ హౌసింగ్ బోర్డుకు తమ ప్లాట్లతో ఎలాంటి సంబంధం లేదు. దీని వెనుక రాజకీయ కుతంత్రం ఉంది. కావాలనే మా ప్లాట్లలో ఫెన్సింగ్ వేశారు. మూడు దశాబ్దాలకు పైగా సింగరేణిలో సర్వీసులు అందించాను. విశ్రాంతి తీసుకునే సమయంలో రోడ్డెక్కాల్సి వచ్చింది. మా సొంత ప్లాట్లలోకి వెళ్లకుండా 6.12 ఎకరాల్లో కంచె వేశారు. ప్రశ్నించేందుకు వెళితే పోలీసులతో బెదిరిస్తున్నారు.
-పులి రాజారెడ్డి, వ్యవస్థాపకుడు, దివ్యానగర్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్