జమ్ము: జమ్ము కశ్మీరులోని దోడా జిల్లాకు చెందిన భడేర్వా ప్రాంతంలో గురువారం ఓ సైనిక వాహనం 200 అడుగుల లోతు లోయలో పడిపోగా 10 మంది సైనిక సిబ్బంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. సైనిక వాహనంలో 17 మంది సైనికులు ప్రయాణిస్తున్నారని, ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఆర్మీ శిబిరానికి వెళుతుండగా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.
భడేర్వా-చంబా అంతర్రాష్ట్ర రోడ్డు వెంబడి ఉన్న ఖన్నీ టాప్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెప్పారు. సైన్యం, జమ్ము కశ్మీరు పోలీసులకు చెందిన సంయుక్త సహాయక బృందం ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రాథమికంగా నలుగురు సైనికులు మరణించినట్లు గుర్తించగా తర్వాత ఆ సంఖ్య పదికి పెరిగింది.