రఘునాథపాలెం, ఫిబ్రవరి 22: దళితబంధు పథకానికి మండలంలోని ఈర్లపూడి గ్రామం ఎంపికైంది. గ్రామంలో మొత్తం 116 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారు. అయితే తొలి విడతగా 97 మందిని, నగరంలోని రెండో డివిజన్ నుంచి ఒకరిని, 32వ డివిజన్ నుంచి ఇద్దరిని ఎంపిక చేసి లబ్ధిదారులుగా గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో మిగిలిన 16 మందికి రెండో దఫాలో లబ్ధి చేకూరనుంది. దళితబంధు అమలుకు కోసం పథకం గ్రామ ఇన్చార్జి ఆదర్శ్ సురభి మంగళవారం గ్రామంలో పర్యటించారు. పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తే ఎలా సద్వినియోగం చేసుకుంటారంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ నర్సింహారావు, ఎంపీపీ భుక్యా గౌరి, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, ఉప సర్పంచ్ చిట్టెం నర్సింహారావు, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.