భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఉద్యమకారులే తమ పార్టీకి ఆస్తిపాస్తులని టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగిందని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా తమకు పోటీ కాదని స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని సింగరేణి అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26 నుంచి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, తొలుత భద్రాచలం నియోజకవర్గానికి వెళ్తానని అన్నారు. ఐదు నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను కలిసి అందరి అభిప్రాయాలను తీసుకుంటానన్నారు. మండల స్థాయిలో పార్టీ అధ్యక్షులు పిలుపునిస్తే పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశానికి రావాల్సిందేనన్నారు. అందరి సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఇప్పటికే మండలాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించామన్నారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, తమకే టిక్కెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకునే వారిని దగ్గరకు కూడా రానివ్వబోమన్నారు. అధిష్టానం ఎవరిని ప్రకటించినా వారిని గెలిపించడం తన బాధ్యత అని అన్నారు. వంద శాతం మార్కులు సాధించడమే తన లక్ష్యమని, అన్ని రంగాల్లో యువతకు పెద్దపీట వేస్తామని అన్నారు.
భద్రాద్రి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మలిదశ ఉద్యమంలో కష్టపడిన నాయకులకు సముచిత స్థానం ఉంటుందని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోవడమే తన కర్తవ్యమన్నారు. ఉద్యమకారులు, జర్నలిస్టుల్లోని ఎస్సీలకు కూడా దళితబంధును అందిస్తామన్నారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.