కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 9 : విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపర్చడంతోపాటు సమాజంలో వారిని మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. బుధవారం కేసీవోఏ క్లబ్లో 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, విద్యార్థుల హాజరుశాతం తదితర అంశాలపై ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వారికి అల్పాహారం అందించేందుకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని డీఈవో సోమశేఖరశర్మకు సూచించారు.
ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కన్సల్టేటీవ్, జిల్లాస్థాయి రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించి 2021-22 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.4971.39 కోట్లు రుణాలు లక్ష్యం కాగా రూ.2489.94 కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో ఎల్డీఎం శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో విద్యాలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, ఏపీఎం నీలేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వర్మీ కంపోస్టు అందజేత
కొత్తగూడెం అర్బన్, మార్చి 9 : మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు కూలీలైన్‌లో తయారుచేసిన వర్మీ కంపోస్టు ఎరువును కౌన్సిలర్ వై.శ్రీనివాసరెడ్డి కలెక్టర్ అనుదీప్‌కు అందించారు. కలెక్టర్ సూచనల మేరకు వార్డులో 40రోజులు తడి చెత్తను వేరు చేసి బెడ్స్ రూపంలో అమర్చి నంబర్‌వన్ వర్మీకంపోస్టు ఎరువును తయారు చేసినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కమిషనర్ నవీన్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ చారి, వార్డు జవాన్ నవీన్, ఆర్పీ మీరాబాయి పాల్గొన్నారు.