హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శనివారం సరూర్‌నగర్‌లో జరుగనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సదస్సుకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గాలికొదిలిందని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొట్టి, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
‘తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులను నట్టేట ముంచడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది‘ అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి, పార్లమెంట్లో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఉద్యోగాలు సంపాదించారని, రాష్ట్రంలోని సాధారణ నిరుద్యోగ యువతకు మాత్రం ఒక ఉద్యోగం కూడా దకకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ప్రియాంకగాంధీని తీసుకొచ్చి నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నోటిఫికేషన్ల నియామక పత్రాలను పంపిణీ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నదని ఆరోపించారు. సరూర్‌నగర్‌లో శనివారం జరుగనున్న యువ సంగ్రామ సదస్సుకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.