భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమంది వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వారి వారి శాఖల్లో కొందరు తమదైన నైపుణ్యం ప్రదర్శించారు. కానీ, దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు, యువత తమకూ ఇలాంటి ఒక ఐటీ శాఖ మంత్రి ఉండాలని బహిరంగంగా ఆకాక్షించింది ఒక్క కేటీఆర్ గురించే. ఈ ఘనత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకో, కేసీఆర్ కుమారుడిగా పుట్టినందుకో కేటీఆర్‌కు లభించలేదు. అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని, జన్మనిచ్చిన నేల తలెత్తుకునేలా ఉండాలని, రాజకీయ జన్మనిచ్చిన ప్రజలకు మేలు జరగాలని ఉన్న ఆకాంక్ష, చిత్తశుద్ధే అందుకు కారణం.
ఇదేదో అన్యాపదేశంగా చెబుతున్నది, అనాలోచితంగా అంటున్నది కాదు. 2014 నుంచి 2023 వరకు కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పెరిగిన ఐటీ ఎగుమతులు, తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీల సంఖ్య ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.57,000 కోట్లు మాత్రమే. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి అది రూ.2,41,275 కోట్లకు ఎగబాకింది. జాతీయ సగటు కన్నా 3.3 శాతం అధికంగా 31.4 శాతం వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేయడం కేటీఆర్ పనితనానికి నిదర్శనం.
2014లో ఐటీ రంగంలో 3.23 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2023 నాటికి ఆ సంఖ్య ప్రత్యక్ష్యంగా 9.97 లక్షలకు చేరింది. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 16 నుంచి 18 లక్షల వరకు ఉద్యోగాల కల్పన జరిగింది. కేటీఆర్ ఐటీ, పరిశ్రమల మంత్రిగా ఉన్న కాలంలో ఏకంగా తెలంగాణలో 25 వేల పరిశ్రమలు అనుమతులు తీసుకోవడం, మొత్తం రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టడం గమనార్హం. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు దీటుగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. 2023-24 సంవత్సరంలో కూడా ఐటీ ఎగుమతులు రూ.2.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కేటీఆర్ గత పదేండ్లుగా వేసిన దారులే అందుకు కారణం.
2022-23తో పోలిస్తే 11.3 శాతం వృద్ధిరేటు నమోదు కావడం గమనార్హం. ఈ వృద్ధిరేటు జాతీయ సగటు 3.3 శాతం కంటే ఎక్కువ. భారతదేశంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ స్టార్టప్ రాజధానిగా మారింది. 2020 సంవత్సరంలో కేటీఆర్ దేశంలోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్‌గా స్కోచ్ సంస్థ నుంచి అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తెలంగాణ ఐటీ రంగంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17.93 శాతం వృద్ధిరేటుతో సాధించిన గణనీయమైన పురోగతికి గుర్తింపుగా లభించింది. జాతీయ స్థాయిలో ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు 8.09 శాతమే ఉండగా, తెలంగాణ దాదాపు రెట్టింపు వృద్ధిని సాధించింది. ఇది కేటీఆర్ నాయకత్వ పటిమకు ఒక ఉదాహరణ మాత్రమే.
కేటీఆర్ హయాంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, హ్యుందాయ్, లులూ గ్రూప్, మలబార్ గ్రూప్, కైటెక్స్ గ్రూప్, హ్యాట్సన్, స్విస్ రే, మీషో, కీమో ఫార్మా వంటి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణకు క్యూ కట్టాయి. మరిన్ని కంపెనీలు తమ పరిశ్రమలను విస్తరించాయి. కేటీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు రాష్ర్టానికే కాదు, దేశానికి కూడా అవసరమని గతంలో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ స్వయంగా చెప్పారంటే కేటీఆర్ గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవాలి. సందర్భం ఏదై నా, అంశం ఏదైనా సంపూర్ణ అవగాహనతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలిగే నైపుణ్యం కేటీఆర్‌ది. ఈ విజయాలే ఇలాంటి ఐటీ శాఖ మంత్రి తమ రాష్ర్టానికి ఉండాలని ఆయా రాష్ర్టాల యువత, ప్రజలు ఆకాంక్షిస్తుండటం విశేషం. ఇలాంటి వ్యక్తే నేటి సమాజానికి, యువతకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తారు.
నాయకుడంటే అవసరానికి వాడుకోవడం కాదు, ఆపదలో అండగా నిలవడం. అదే అసలైన నాయకుడి లక్షణం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కేటీఆర్. సోషల్ మీడియా వేదికగా నిరంతరం అందుబాటులో ఉండే కేటీఆర్ తన దృష్టికి వచ్చిన సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు. దేశంలో ఇలా సామాన్యులకు అందుబాటులో ఉండే నాయకుల్లో కేటీఆర్ అగ్రగణ్యుడిగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.
అంతేకాదు, తన పుట్టినరోజున ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పేరుతో తన అభిమానులు, పార్టీ నేతల ద్వారా, స్వయంగా తాను ఎందరికో అండగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమం కింద తెలంగాణలోని వివిధ నియోజకవర్గాలకు 108 అంబులెన్సులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం, సురక్షితమైన తాగునీటి సరఫరా, పాఠశాలలకు నోట్‌బుక్స్ పంపిణీ, రోగులకు అత్యవసరమైన ఔషధాలు, 1700 మందికి పైగా దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, యూనిఫామ్స్, 6 వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు, 100 మందికి ల్యాప్‌టాప్‌లు, రూ.8 కోట్లతో అత్యాధునిక పాఠశాల భవనాల నిర్మాణం, 4,910 మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు, ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడూ చేయని అరుదైన ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కేటీఆర్‌లోని నవతరం నాయకుడిని ఆవిష్కరిస్తుంది.
కేటీఆర్ ఒక విజయవంతమైన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రే కాదు, విజయవంతమైన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు, మానవతావాది కూడా. 2009లో తొలిసారి సిరిసిల్ల శాసనసభ సభ్యుడిగా పోటీ చేసి 171 ఓట్లతో విజయం సాధించిన కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ క్రమంలో అదే నియోజకవర్గం నుంచి ఏకంగా 68,219 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. ఆ తర్వాత 2014, 2018, 2023లలో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 2023లో స్వల్ప ఓట్ల తేడాతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైనా, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. ప్రజల తరఫున నిలబడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కేటీఆర్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నది. అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ మోసాలను నిరంతరం ఎండగడుతూ తెలంగాణ సమాజాన్ని కేటీఆర్ జాగృతం చేస్తున్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ ఒక తరానికి ఆరాధ్యుడైతే, తెలంగాణ ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు కేటీఆర్ ఆదర్శంగా నిలుస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఉద్యమకారుడిగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా తనదైన శైలిలో రాణిస్తూ తెలంగాణ బ్రాండ్‌గా పేరుపడ్డ కేటీఆర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.