తల్లి రెక్కల కష్టాన్ని చూసి చలించిపోయింది. ఆర్థిక ఇబ్బందులు అడ్డురావడంతో డాక్టర్ కావాలనే తన కలను సమాధి చేసుకుంది. అయినా కూడా చదువుపై పట్టు వదల్లేదు. ర్యాంకులు కొల్లగొడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తగా కొలువు సాధించింది హైదరాబాద్‌కు చెందిన కెల్ల పూర్ణ చంద్రిక. నిరంతర పరిశోధనలతో.. అధిక దిగుబడి సాధించే మార్గాలను కనుగొన్నది. సేంద్రియ ఎరువులు, వంగడాల ట్రీట్మెంట్ పద్ధతులను ఆవిష్కరించి రైతుకు దన్నుగా నిలిచింది. తన పరిశోధనకు పేటెంట్ హక్కులు సైతం పొందిన ఈ యువ శాస్త్రవేత్త జిందగీతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే..
నాకు పదేళ్లప్పుడు మా నాన్న పోయారు. మా అమ్మే తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని ముందుకు నడిపించింది. టైలరింగ్ పని చేస్తూ నన్ను చదివించింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా నా చదువు మాత్రం ఆపలేదు. కాకపోతే తక్కువ ఖర్చుతో చదువుకునే కోర్సులవైపు మొగ్గు చూపించా. ఎంబీబీఎస్ సీట్ వచ్చినా కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా అందులో చేరలేదు. త్వరగా ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనతో తాడేపల్లిగూడెంలోని ఉద్యాన వర్సిటీలో చేరా. డిగ్రీ పూర్తి చేయడంతోనే ఐకార్ జూనియర్ ఫెలోషిప్ పరీక్ష రాసిన నాకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్ రావడంతో ఢిల్లీలో సీట్ సంపాదించాను. ఎంఎస్సీలో వ్యవసాయ రసాయనాల విభాగంలో చేరి పరిశోధనలపైనా దృష్టి సారించాను. పీజీ పూర్తవ్వగానే భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్డీ చేశాను. తర్వాత అఖిలభారత వ్యవసాయ పరిశోధన సర్వీస్ (ఏఆర్ఎస్) పరీక్ష రాసి దేశంలోనే మొదటి ర్యాంకు సాధించాను. 2015లో హైదరాబాద్‌లోని జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో వ్యవసాయ రసాయనాల శాస్త్రవేత్తగా చేరి అందులోనే కొనసాగుతున్నాను.
నేను ఎంఎస్సీ చేస్తున్న సమయంలో నాకు గైడ్‌గా వ్యవహరించిన డాక్టర్ అనుపమాసింగ్ ప్రభావం నాపై ఎంతో పడింది. ఆమెలాగా ప్రజలకు ఉపయోగపడే పరిధశోధనలు చేయాలనే ఆలోచన మొదలైంది. ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే ఒక శాస్త్రవేత్తగా రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు పనిచేశాను. మనమంతా రొయ్యపొట్టు పనికిరాదని పారేస్తాం. కానీ, నేను దానిని సహజ ఎరువుగా మార్చే ప్రక్రియపై పరిశోధన చేశాను. రొయ్యపొట్టును శుద్ధి చేసి ద్రవంగా మార్చి, మొక్కలకు మేలు చేసే ట్రైకోడెర్మా వంటి సూక్ష్మజీవులు, వివిధ పోషకాలు, శిలీంధ్ర సంహారకాలు, సేంద్రియ పదార్థాలను కలిపి మిశ్రమాన్ని తయారు చేశాను. ఈ వినూత్న పరిశోధనకు ఎనిమిదేళ్లపాటు కష్టపడి పేటెంట్ హక్కులు సాధించాను. దానికి అనుసంధానంగా చేస్తున్న బయోపాలిమర్ ఆధారిత మల్టీలేయర్ సీడ్ కోటింగ్, స్ప్రే చేయగల బయోడీగ్రేడబుల్ మల్చ్‌లు, పోషకాలు, బయో ఏజెంట్ల కోసం నానో ఎనేబుల్డ్ క్యారియర్ విధానాలపై చేస్తున్న పరిశోధనలు సైతం ముగింపు దశలో ఉన్నాయి.

గతేడాది భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చేతుల మీదుగా ఉద్యానవన కేటగిరీలో యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నాను. ఈ అవార్డుకోసం జాతీయ స్థాయిలో 700 మందికి పైగా పోటీపడగా తెలుగు రాష్ర్టాల నుంచి ఆ అవార్డు అందుకున్న తొలి శాస్త్రవేత్తగా నిలిచాను.
వరి, మక్కజొన్న వంటి పంటల్లాగా మిగతా పంటలు పెరగడం లేదు. ఎందుకుంటే వాటిని ప్రాసెస్ చేసినట్లు మిగతావాటిని ప్రాసెస్ చేయడం అరుదు. అందుకే భూమిలో వేసిన విత్తనం ఆరోగ్యంగా ఏపుగా పెరిగేందుకు నా వంతుగా కృషి చేశాను. కుసుమలు, పల్లీలు, ఆలుగడ్డ, కందులు, తృణధాన్యాల లాంటి వాటిపై పరిశోధన చేశాం. మొదట్లో నేను చెప్పిన పంట వేసేందుకు ఒక్కరైతు కూడా ముందుకు రాలేదు. మేమే ఒకరైతును ఒప్పించి తనకున్న ఒకరం పొలంలో సీడ్ ట్రీట్మెంట్ చేసిన వాటితోపాటు వేరుగా ఉన్న విత్తనాలను కూడా ఇచ్చాం. ఆ రెండు రకాల విత్తనాల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. 2024 రబీలో ప్రారంభించగా, ప్రస్తుతం 45 ఎకరాల్లో సాగుచేస్తున్నాం. ఎరానికి ఒక్క పంటకు రూ.30 వేల వరకు లాభం రావడం నా కండ్లారా చూశాను. నూనె గింజలు, పప్పు దినుసుల్లో 30 శాతం వరకు దిగుబడి పెరగడం విశేషం.
ఈ రోజుల్లో ఒక అమ్మాయి అనుకున్నది సాధించాలంటే పనిచేసే చోట, ఇంట్లో సమానమైన సహకారం ఉండాలి. అప్పుడే ముందుకు సాగిపోతాం. నాకు అలాంటి సహకారమే లభించింది. ప్రతి పరిశోధన విజయం సాధించకపోవచ్చు. ఫెయిల్ అయినదాని గురించి బెంగపడకుండా… కొత్తగా ఆలోచించాలి. వాతావరణ మార్పుల కారణంగా జీవవైవిధ్య సూక్ష్మజీవులు నాశనమవుతున్నాయి. దీంతో పంట దిగుబడిపై తీవ్రమైన ప్రభావం పడుతున్నది. వీటన్నింటినీ తట్టుకునేలా బయో పాలిమర్ ఆధారిత విత్తనోత్పత్తి చేపట్టాలనేది నా లక్ష్యం. నా ప్రతి పరిశోధన పేద రైతులకు ఉపశమనం కలిగించాలనేదే నా తపన.